Vizag Fire: విశాఖ హార్బర్ అగ్నిప్రమాద ఘటన.. సీపీ కీలక ప్రెస్‌మీట్
ABN , First Publish Date - 2023-11-25T16:13:04+05:30 IST
విశాఖ హార్బర్ ప్రమాదానికి సంబంధించిన కేసు విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిషింగ్ హార్బర్ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాని, సత్యంకు ఎలాంటి సంబంధం లేదని
విశాఖ: ఓ వైపు దేశ వ్యాప్తంగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్.. కళ్లులన్నీ టీవీలకు అతుక్కుపోయాయి. ఇంకో వైపు టీమిండియా కప్ అందుకోవాలని పూజలు.. ప్రార్థనల్లో అభిమానులు మునిగిపోయారు. ఇలాంటి ఉత్కంఠ సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఊహించని ప్రమాదం ఖాకీలను నిర్ఘాంతపోయేలా చేసింది. మంటలు చెలరేగి క్షణాల్లో బోట్లు కాలి బూడిదయ్యాయి. శీతాకాలం.. పైగా రసవత్తరంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఇంత భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్.. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి మీడియా ముందుకు వచ్చారు.
హార్బర్ ఫైర్ యాక్సిడెంట్‌పై సీపీ ఏమన్నారంటే..
‘‘వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేశ్‌కు చెందిన 887 నెంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకోని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరేట్ తాగి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మెల్లమెల్లగా మంటలు చెలరేగి బాగా వ్యాపించాయి. మంటలు వ్యాపించడం గమనించి మెల్లగా అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437, 438, 285, ప్రకారం కేసు నమోదు చేశాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించాం. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగా యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశాం. ప్రాథమిక సమాచారం మేరకు కేవలం విచారణలో భాగంగానే నాని తీసుకువచ్చాం. విచారణలో అతని ప్రమేయం లేదంటే మేము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్లం. కానీ ఈ లోపే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 47కు ఫైగా సీసీ కెమెరాలు పరిశీలించాం. ఇన్ని రోజులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశాం’’ అని సీపీ రవి శంకర్ అయ్యన్నర్ తెలిపారు.
‘‘నిందితులు సిగరేట్ విసిరేయడంతోనే వలలకు నిప్పు అంటుకున్న తర్వాత మొదట పొగలు మాత్రమే వచ్చాం. ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. నిందితులు ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయి. రూ.8 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మానిటరింగ్ చేస్తాం.’’ అని సీపీ వెల్లడించారు.
అనుమానాలు..
విశాఖ హార్బర్ ప్రమాదానికి సంబంధించిన కేసు విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిషింగ్ హార్బర్ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాని, సత్యంకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. వీడియోలో ఉన్నవారు, అదుపులోకి తీసుకున్న వ్యక్తులు వేర్వేరుగా ఉన్నారని ఆరోపించారు. వీడియోలో ఉన్న వ్యక్తులు యువకులు.. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారు మాత్రం ఒక యువకుడు మరొక వృద్ధుడు ఉన్నారు. పోలీసులు వీడియోలు తీసుకొచ్చి మీడియాకు చూపించకుండా వెళ్లిపోయారు. పోలీసుల అదుపులో ఉన్నవారు నిజమైన నిందితులా ? లేకపోతే కేసును ముగించడం కోసం ఇరికించారా? అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి