Share News

అమృత్‌ భారత్‌లో రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-12-10T01:07:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పనులకు రూ.8,400 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు.

అమృత్‌ భారత్‌లో రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి

ఉత్తరాంధ్రలో 15 స్టేషన్లు...

రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌

సింహాచలం స్టేషన్‌ సందర్శన

గోపాలపట్నం, డిసెంబరు 9:

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పనులకు రూ.8,400 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నగరానికి విచ్చేసిన ఆయన సింహాచలం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, సింహాచలం, అనకాపల్లి, అరకులోయ, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, దువ్వాడ, ఎలమంచిలి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, నౌపాడ, పలాస, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. సింహాచలం రైల్వే స్టేషన్‌ను రూ.19.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. స్టేషన్‌లో అదనంగా ఫ్లైఓవర్‌ వంతెనలు, ప్లాట్‌ఫారాల నిర్మాణంతో పాటు ప్రాంగణ ఆధునికీకరణ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ప్రాంగణంలో పర్యటించి త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే మేనేజర్‌ మనోజ్‌శర్మ, డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌, నగర బీజేపీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి తొలుత సింహాచలం వెళ్లి వరాహ లక్ష్మీనరసంహస్వామి దర్శనం చేసుకున్నారు.

Updated Date - 2023-12-10T01:07:12+05:30 IST