చదువు సాగేదెట్టా?

ABN , First Publish Date - 2023-02-22T00:44:42+05:30 IST

మండలంలోని బంగారమ్మపేట శివారు గుమ్మళ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఏడేళ్లుగా పూరిపాకలో కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నేల మీదే కూర్చుని చదువుకుంటున్నారు. వర్షాలు వస్తే ఈ పాఠశాలకు సెలవే. పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని పలుమార్లు అధికారులకు గ్రామస్థులు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు.

చదువు సాగేదెట్టా?
పాకలో కొనసాగుతున్న గుమ్మళ్లపాలెం పాఠశాల

- ఏడేళ్లుగా పాకలోనే గుమ్మళ్లపాలెం పాఠశాల నిర్వహణ

- వర్షమొస్తే సెలవు

- కనీస సౌకర్యాలు కరువు

- పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం

- నెరవేరని ఎంపీ, ఎమ్మెల్యేల హామీ

- విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

కొయ్యూరు, ఫిబ్రవరి 21: మండలంలోని బంగారమ్మపేట శివారు గుమ్మళ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఏడేళ్లుగా పూరిపాకలో కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నేల మీదే కూర్చుని చదువుకుంటున్నారు. వర్షాలు వస్తే ఈ పాఠశాలకు సెలవే. పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని పలుమార్లు అధికారులకు గ్రామస్థులు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు.

మండలంలో బంగారమ్మపేట శివారు గుమ్మళ్లపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఏడేళ్ల క్రితం కూల్చివేశారు. కొత్త భవన నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వశిక్షా అభియాన్‌ నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. అయితే పనులు ప్రారంభం కాలేదు. విద్యార్థుల ఇబ్బందులను గమనించిన గ్రామస్థులు తాటాకు పాకను ఏర్పాటు చేశారు. అందులో ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 20 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వీరందరికీ ఒకే ఒక్క ఉపాధ్యాయిని పాఠాలు బోధిస్తున్నారు. ఆమె సెలవు పెట్టినా, వర్షాలు కురిసినా ఆ పాఠశాలకు సెలవు ప్రకటించినట్టే. దీని వల్ల విద్యార్థుల చదువులు సజావుగా సాగడం లేదు. ఈ పాఠశాలను గతంలో ఎంపీ మాధవి, పలుమార్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సందర్శించి శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీలు ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత నెలలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ మాతే బాలయ్య పాడేరు వెళ్లి పాఠశాల సమస్యపై స్పందన కార్యక్రమంలో ఐటీడీఏ పీవోకు వినతి పత్రం ఇచ్చారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని పీవో హామీ ఇచ్చారే గానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలకు సుమారు పది సెంట్ల స్థలం ఉండడంతో ఆక్రమణలకు గురికాకుండా ఉపాధ్యాయిని కేఎంఎస్‌ లక్ష్మి నాలుగేళ్ల క్రితం చుట్టూ కంచె ఏర్పాటు చేయించి సంరక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-02-22T00:44:43+05:30 IST