దువ్వాడ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు
ABN , First Publish Date - 2023-01-06T00:43:26+05:30 IST
ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం రాత్రి డీఆర్‌ఎం అనూప్ సత్పతి దువ్వాడ రైల్వే స్టేషన్‌కు ఆకస్మికంగా విచ్చేసి తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలపై ఆరా..
కూర్మన్నపాలెం, జనవరి 5: ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం రాత్రి డీఆర్‌ఎం అనూప్ సత్పతి దువ్వాడ రైల్వే స్టేషన్‌కు ఆకస్మికంగా విచ్చేసి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వెయిటింగ్ హాల్‌లో వున్న ప్రయాణికులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫుట్‌వే వంతెన మీదుగా ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం నుంచి నాలుగో నంబర్ ప్లాట్‌ఫారం వరకు వచ్చి తనిఖీలు జరిపారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా స్టేషన్ సిబ్బంది అప్రమత్తంగా వుంటూ సేవలందించాలన్నారు. అనంతరం డీఆర్‌ఎం సత్పతి ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తంగా వుండాలని, కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం చేయరాదని సూచించారు. ఎటువంటి కారణం లేకుండా రైళ్లలో చైన్ లాగరాదన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్టేషన్‌లో నెలకొన్న పలు సమస్యలను డీఆర్‌ఎంకు వివరించారు. ప్లాట్‌ఫారం ఎత్తు పెంచాలని, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని, ఎస్కలేటర్, లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత డీఆర్‌ఎం ఇటీవల మృతి చెందిన విద్యార్థిని శశికళ, బంగారు వ్యాపారి కర్రి సురేశ్ ఎక్కడ ప్రమాదానికి గురయ్యారో ఆ ప్రాంతాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లోని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట సీనియర్ డివిజినల్ ఇంజనీర్ (కో-ఆర్డినేషన్) పీకే మహారాణా, సీనియర్ డివిజినల్ కమర్షియల్ డివిజినల్ మేనేజర్ ఏకె త్రిపాఠి, సీనియర్ డివిజినల్ సిగ్నల్ అండ్ టెలీకాం ఇంజనీర్ దీప్తాన్ష్ శర్మ, సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ సీహెచ్ రఘువీర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాటమ చంద్రరావు, ఈశ్వర్, రామకృష్ణ, జాషువా, వీర్రాజు, ఎంఎస్‌ఎన్ మూర్తి, తదితరులు ఉన్నారు.