సిఫారసు లేఖ ఉంటేనే తూర్పు కాపు సర్టిఫికెట్లు!

ABN , First Publish Date - 2023-05-24T00:51:03+05:30 IST

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడంలేదు అన్నట్టుగా వుంది కుల ధ్రువీకరణ పత్రాల జారీ తూర్పు కాపుల పరిస్థితి. ‘మండల తూర్పు కాపు సంక్షేమ’ సంఘం నాయకులు సిఫారసు లేఖ ఇస్తేనే రెవెన్యూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు. సిఫారసు లేఖ ఇవ్వడానికి సంఘం నాయకుల్లో ఒక వ్యక్తి మూడు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. సిఫారసు లేఖ లేని దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు చెప్పిన వివరాలు...

సిఫారసు లేఖ ఉంటేనే తూర్పు కాపు సర్టిఫికెట్లు!
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నారాయణరాజుపేటకు చెందిన కర్రి దేవి, ఆమె పిల్లలు. తూర్పు కాపు సంక్షేమ సంఘం సిఫారసు లేఖ లేకపోవడంతో రెవెన్యూ అధికారులు తన ఇద్దరు పిల్లలకు తూర్పు కాపు సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు.

ఒక్కో లేఖకు రూ.3 వేలు వసూలు చేస్తున్న కుల సంఘం నేతలు

నలుగురి పేర్లతో లెటర్‌హెడ్‌

దానిపైనే తహసీల్దార్‌ను ఉద్దేశించి సిఫారసు పత్రం

లేఖ జతచేయకపోతే దరఖాస్తులు తిరస్కరిస్తున్న రెవెన్యూ అధికారులు

లబోదిబోమంటున్న తూర్పు కాపు కులస్థులు

మాకవరపాలెం, మే 23: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడంలేదు అన్నట్టుగా వుంది కుల ధ్రువీకరణ పత్రాల జారీ తూర్పు కాపుల పరిస్థితి. ‘మండల తూర్పు కాపు సంక్షేమ’ సంఘం నాయకులు సిఫారసు లేఖ ఇస్తేనే రెవెన్యూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు. సిఫారసు లేఖ ఇవ్వడానికి సంఘం నాయకుల్లో ఒక వ్యక్తి మూడు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. సిఫారసు లేఖ లేని దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది బాధితులు చెప్పిన వివరాలు...

తెలుగుదేశం పార్టీ గత పర్యాయం అధికారంలో వున్నప్పుడు అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు 2018లో అనకాపల్లిలో జరిగిన సమావేశంలో నాటి సీఎం చంద్రబాబునాయుడు... ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న కాపు కులస్థులకు ‘తూర్పు కాపు’ సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు జీవోను కూడా విడుదల చేయించారు. దీంతో గ్రామీణ ప్రాంతంలో పలువురు కాపులు ‘తూర్పు కాపు’ సర్టిఫికెట్లు పొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో ఉన్న కాపు నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకొని నలుగురు వ్యక్తులతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా గొంతిన హరిబాబు, ఉపాధ్యక్షుడిగా తిప్పర్న వెంకటరమణ (వీరిద్దరూ వైసీపీ), కార్యదర్శిగా దుబాసి వెంకటగిరి, గౌరవ అధ్యక్షుడిగా యర్రంశెట్టి రాజారావు(వీరద్దరూ టీడీపీ)తో ‘మండల తూర్పు కాపు సంక్షేమ సేవా సంఘం’ ఏర్పాటు చేశారు. సంఘం నుంచి సిఫారసు లేఖ ఇస్తేనే ‘తూర్పు కాపు’ సర్టిఫికెట్లు జారీ చేయాలని మండల రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో రెవెన్యూ అధికారులు కూడా వారు చెప్పినట్టే నడుచుకోవడం మొదలుపెట్టారు. అయితే సంఘం నేతలు ఒక్కో సిఫారసు లేఖకు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. గత నాలుగేళ్లలో మండలంలో సుమారు 250 మందికి ‘తూర్పు కాపు’ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఒక్కో సిఫారసు లేఖకు రూ.3 వేల చొప్పున సుమారు ఏడున్నర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. ఈ సొమ్ములో కొంతమొత్తం రెవెన్యూ అధికారులకు ముడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే సిఫారసు లేఖ ఉంటే తప్ప తూర్పు కాపు సర్టిఫికెట్‌ జారీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో మండలంలోని నారాయణరాజుపేట గ్రామానికి చెందిన కర్రి దేవి, తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి, జయసూర్యలకు తూర్పు కాపు సర్టిఫికెట్‌ల కోసం ఇటీవల దరఖాస్తు చేశారు. కానీ ‘మండల తూర్పు కాపు సంక్షేమ సేవా సంఘం’ సిఫారసు లేఖను దరఖాస్తుతోపాటు జత చేయకపోవడంతో ఆమెకు సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. దీనిపై తహసీల్దార్‌ ప్రసాదరావును వివరణ కోరగా, తూర్పు కాపు సర్టిఫికెట్‌ల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి సిఫారసు లేఖ అవసరం లేదని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సర్టిఫికెట్లు జారీచేస్తామని తెలిపారు.

రూ.3 వేలు ఇస్తేనే సిఫారసు లేఖ...

శ్రీరంగం వెంకటేశ్వరరావు, నగరం, మల్లవరం పంచాయతీ

నాకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఒకరికి తూర్పు కాపు సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశాను. వీఆర్‌వో వద్దకు వెళితే తూర్పు కాపు సంక్షేమ సంఘం నుంచి సిఫారసు లేఖ కావాలని చెప్పారు. తామరం వెళ్లి సంఘం అధ్యక్షుడిని కలిశాను. మూడు వేల రూపాయలు ఇస్తేనే సిఫారసు లేఖ ఇస్తానని స్పష్టం చేశారు. అంత ఇచ్చేకునే స్థోమత లేదు రూ.500 ఇస్తానని చెప్పాను. కుదరదని ఆయన స్పష్టం చేయడంతో తిరిగి వచ్చేశాను.

డబ్బులు తీసుకోవడంలేదు

తూర్పు కాపులకు సర్టిఫికెట్ల జారీ కోసం డబ్బులు వసూలు చేయడంలేదని తూర్పు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గొంతిన హరిబాబుతోపాటు మరికొంత సభ్యులు తహసీల్దార్‌ ప్రసాదరావుకి తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌తో మాట్లాడారు. తూర్పు కాపు కుల సంఘంలో సభ్యులుగా నమోదైన వారికి డబ్బులు తీసుకోకుండా సిఫారసు లేఖలు ఇస్తున్నట్టు చెప్పారు. సంఘంతో సంబంధంలేని వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆన్నారు.

Updated Date - 2023-05-24T00:51:03+05:30 IST