ఈపీడీసీఎల్ కార్యాలయాల ఎదుట ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2023-07-28T00:55:02+05:30 IST
స్థానిక నిదానందొడ్డిలోని ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సంస్థలో పనిచేసే ఉద్యోగులు గురువారం వివిధ సమస్యల పై నిరసన తెలియజేశారు.
అనకాపల్లి టౌన్, జూలై 27 : స్థానిక నిదానందొడ్డిలోని ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సంస్థలో పనిచేసే ఉద్యోగులు గురువారం వివిధ సమస్యల పై నిరసన తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత దుర్భలత్వం పొందిన ఎనర్జీ అసిస్టెంట్లపై ఆధారపడిన కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగుల వలే కారుణ్య నియామక పథకం వర్తింపజేయాలని, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని, పొరుగు సేవల సిబ్బందిని విద్యుత్ సంస్థల్లో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తదితర సమస్యలపై నినాదాలిచ్చారు. ఈ ధర్నాలో యూనియన్ జేఏసీ ప్రతినిధులు ఎ.నూకరాజు, పేరపు రాంబాబు, ఓ. శ్రీనివాసరావు, చవితిన నరసింగరావు, ఏఈలు శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు.
పాయకరావుపేటలో..
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు జీతభత్యాలు వెంటనే చెల్లించడంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు నల్ల బాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎల్.నూకరాజు, సీహెచ్‌వీ.సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ తాము ప్రాణాలు పణంగా పెట్టి టైంతో పనిలేకుండా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యుగుల సంఘం నాయకులు ఎస్.సత్యనారాయణ, వై.రాజయ్య, కార్మికులు పాల్గొన్నారు.