Share News

‘తూర్పు’ వైసీపీలో లుకలుకలు

ABN , First Publish Date - 2023-10-16T00:15:29+05:30 IST

వైసీపీ తూర్పు నియోజకవర్గం నేతల్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.

‘తూర్పు’ వైసీపీలో లుకలుకలు

నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వంశీకృష్ణ, అక్కరమాని డుమ్మా

వైవీసుబ్బారెడ్డి సాక్షిగా బయటపడిన విభేదాలు

విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ తూర్పు నియోజకవర్గం నేతల్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. ఆదివారం నిర్వహించిన నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, నియోజకవర్గం మాజీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల హాజరుకాకపోవడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. బీచ్‌రోడ్డులోని గాదిరాజుప్యాలెస్‌లో ఆదివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ ఉమ్మడి విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారైనప్పటికీ బలమైన నేతలు ఇద్దరూ రాకపోవడం పార్టీనేతలతోపాటు కార్యకర్తల్లో చర్చనీయాంశంగామారింది.

తూర్పు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఓటమిపాలైనప్పటికీ 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందువరకూ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అతనికి కాకుండా అదే సామాజికవర్గానికి చెందిన అక్కరమాని విజయనిర్మలకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ సమన్వయకర్తగా విజయనిర్మల పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అనంతరం ఆమెకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. తనకు టికెట్‌ దక్కలేదనే అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ను బుజ్జగించిన అధిష్ఠానం అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. దీంతో ఆయన కూడా పార్టీలో చురుగ్గానే పనిచేస్తున్నారు. ఇదిలావుండగా కొద్దిరోజుల కిందట అకస్మాత్తుగా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి అక్కరమాని విజయనిర్మలను తొలగించి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించారు. దీంతో ఆమె ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. సమన్వయకర్త బాధ్యతలు చేపట్టిన ఎంపీ ముఖ్యనేతలతోపాటు వార్డు స్థాయి నేతలను కలిసి పార్టీకోసం పనిచేయాలని కోరుతూ వచ్చారు. దీంతో అందరూ కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆదివారం జరిగిన నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశానికి కీలకనేతలిద్దరూ గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి హాజరైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎంవీవీకి ఏమేరకు సహకస్తారనే దానిపై పార్టీవర్గాల్లోనూ అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-10-16T00:15:29+05:30 IST