చింతపల్లి ఆస్పత్రిలో తొలి సిజేరియన్ ఆపరేషన్
ABN , First Publish Date - 2023-02-14T00:58:30+05:30 IST
స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ గర్భిణికి వైద్యులు తొలి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సిజేరియన్ శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభానికి ముందే శస్త్ర చికిత్స
చింతపల్లి, ఫిబ్రవరి 13: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఓ గర్భిణికి వైద్యులు తొలి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సిజేరియన్ శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో సూపరింటెండెంట్, స్త్రీ వైద్యనిపుణులు జి.ఆదిత్య కీర్తి, సీనియర్ వైద్యాధికారి సుధా శారద, అనస్తీషియా వైద్యులు కె.రమేశ్ ఆ గర్భిణికి శస్త్ర చికిత్స చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు. ఎనిమిది నెలల కిందట చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్థాయిని పెంచారు. నాలుగు నెలల కిందట రీస్ట్రక్చర్ విధానం అమలులోకి తీసుకొచ్చి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గైనికాలజిస్టులు, అనస్తీషియన్‌ను నియమించారు. అయితే నూతన వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలోనూ, అందుబాటులోనున్న భవనంలోని థియేటర్ శస్త్రచికిత్సలకు అనువుగా లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్లను వైద్యులు ప్రారంభించలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని థియేటర్ ఆధునికీకరణకు సుమారు రూ.నాలుగు లక్షల నిధులను మంజూరు చేశారు. రెండు వారాల కిందట ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో మరో ఐదు రోజుల్లో కలెక్టర్, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణతో సిజేరియన్ శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు. అయితే సోమవారం ఉదయం అంతర్ల గ్రామం నుంచి నెలలు నిండిన గర్భిణి పోలోజు జ్యోతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. జ్యోతికి తొలి కాన్పు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. దీంతో రెండో కాన్పు కూడా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సివుంది. ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి ఓవైపు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించే సమయం లేక అప్పటికప్పుడు సీనియర్ గైనికాలజిస్టు సుధాశారద, సూపరింటెండెంట్ ఆదిత్య కీర్తీలు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకుని వెను వెంటనే ఏర్పాట్లు చేశారు. ఇద్దరు గైనికాలజిస్టులు, అనస్తీషియన్ విజయవంతంగా సిజేరియన్ శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెడికల్ కౌన్సిల్ సభ్యుడు ఆస్పత్రిని సందర్శించి గర్భిణితో మాట్లాడారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఇక మీదట ఏరియా ఆస్పత్రిలోనే సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురియా పుష్పలత, వైసీపీ మండలాధ్యక్షుడు మోరీ రవి, ఎంపీటీసీ సభ్యురాలు దారలక్ష్మి పద్మ పాల్గొన్నారు.