ఫ్లూ వైరస్‌ విజృంభణ

ABN , First Publish Date - 2023-03-07T01:14:06+05:30 IST

జిల్లాలో కొద్దిరోజులుగా ఫ్లూ వైరస్‌ విజృంభిస్తోంది.

ఫ్లూ వైరస్‌ విజృంభణ

తీవ్రమైన దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కొందరిలో తీవ్రమైన జ్వరం

జిల్లాలో భారీగా కేసులు...ఆరోగ్య శాఖ అప్రమత్తం

రోగుల వివరాలను నమోదుతోపాటు పర్యవేక్షణకు ఆదేశం

అవసరమైతే కఫం నమూనాలు తీసి పరీక్షల నిర్వహణ

చిన్నారులు, వృద్ధుల్లో అధికంగా ఉన్న వైరస్‌ తీవ్రత

కుటుంబసభ్యుల్లో ఆందోళన

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొద్దిరోజులుగా ఫ్లూ వైరస్‌ విజృంభిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు వైరస్‌ బారినపడి ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణంగా సీజన్‌ మారే సమయంలో ఈ తరహా వైరస్‌లు వ్యాప్తిచెందడం సాధారణమే. వైరస్‌ బారినపడిన వారిలో లక్షణాలు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంటాయి. అ తికొద్ది మందిలో మాత్రమే ఐదారు రోజులు ఉంటాయి. కానీ, కొద్దిరోజులుగా వ్యాప్తి చెందుతున్న ఫ్లూ వైరస్‌ బాధితుల్లో లక్షణాలు వారాలు గడుస్తున్నా తగ్గడం లేదు. కనీసం పది రోజుల నుంచి మూడు, నాలుగు వారాలు వరకు ఉంటున్నాయి. మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం వుండడం లేదంటున్నారు. దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఐసీఎంఆర్‌ హెచ్‌ 3 ఎన్‌2 వైరస్‌గా నిర్ధారించింది. సాధారణ ఫ్లూ వైరస్‌లతో పోలిస్తే ఇది బలంగా ఉండడం, కొవిడ్‌, ఇతర కారణాల వల్ల ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి కొంత వరకు తగ్గడం వల్ల దీని ప్రభావం అధికంగా వుంటోందని ప్రకటించింది. అయితే, ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ లక్షణాలు..

ఫ్లూ వైరస్‌ బారినపడుతున్న వారిలో ఎక్కువగా తీవ్రమైన దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కొందరిలో తీవ్రమైన జ్వరం ఉంటున్నాయి. కొందరిలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలకు ఈ వైరస్‌ కారణమవుతోంది. వైద్యుల వద్దకు వెళ్లినా, మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. ఇకపోతే, వైరస్‌ తీవ్రత ఎక్కువగా వున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఫ్లూయిడ్స్‌ అధికంగా తీసుకోవడంతోపాటు వైద్యులను సంప్రతించకుండా ఇష్టానుసారం మందులు వాడొద్దని సూచించింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్లాత్‌ అడ్డంగా పెట్టుకోవాలని, లక్షణాలు ఉన్నవాళ్లు..పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉండాలని సూచించింది. జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిట్మాల్‌ వినియోగించాలని, ఇబ్బంది ఎక్కువగా వుంటే వైద్యులను సంప్రతించాలని సూచించింది. ప్రస్తుతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళుతున్న రోగుల సంఖ్య అధికంగా ఉంటోంది. కేజీహెచ్‌తోపాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రులు ఓపీ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చిన్నారుల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాత్రివేళ చిన్నారులు తీవ్రమైన దగ్గుతో ఇబ్బందులు పడుతుండడంతో తల్లిదండ్రుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. మందులు వాడుతున్నా వేగంగా ఫలితం కనిపించకపోవడమూ తల్లిదండ్రుల ఆందోళనకు మరో కారణంగా పేర్కొంటున్నారు.

ఆరోగ్యశాఖ అప్రమత్తం

జిల్లాలోనూ రెండు నెలల నుంచి ఈ తరహా కేసులు భారీగా నమోదవుతుండడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ తరహా లక్షణాలతో వచ్చే రోగుల వివరాలను నమోదుచేయాలని, ఆయా రోగులు ఎన్ని రోజులు నుంచి ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్నారు వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మెడికల్‌ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇబ్బందికరంగా వున్న కేసులు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైన వారి నుంచి కఫం నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆయా రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించామని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి

డాక్టర్‌ వై.జ్ఞానసుందరరాజు, జనరల్‌ మెడిసిన్‌

గతంతో పోలిస్తే ఫ్లూ వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. సాధారణంగా హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, ప్రస్తుతం హెచ్‌3ఎన్‌1 వైరస్‌ ఎక్కువగా విజృంభిస్తోంది. మందులు వాడుతున్నా వేగంగా తగ్గుముఖం పట్టడం లేదు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్‌ న్యుమోనియా బారినపడేలా చేస్తోంది. వైరస్‌ బయట ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు కొద్దిరోజులపాటు మాస్క్‌ ధరించడం ఉత్తమం. పోషకాలతో కూడిన వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలి. చల్లని పానీయాలు, బయటి ఆహారాలకు కొంత దూరంగా ఉండాలి.

Updated Date - 2023-03-07T01:14:06+05:30 IST