చిట్‌ల పేరిట మోసం
ABN , First Publish Date - 2023-06-16T01:39:44+05:30 IST
చిట్టీల పేరిట ఓ వైసీపీ నాయకుడి సతీమణి సుమారు రూ.70 లక్షలకు టోకరా వేశారు.
రూ.70 లక్షలకు టోకరా వేసిన వైసీపీ నాయకుడి భార్య
ఏడాదిగా నగదు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు
పెందుర్తి, జూన్ 15:
చిట్టీల పేరిట ఓ వైసీపీ నాయకుడి సతీమణి సుమారు రూ.70 లక్షలకు టోకరా వేశారు. ఏడాదిగా డబ్బు చెల్లించకపోవడంతో బాధితులు గురువారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...
పెందుర్తి బాలాజీనగర్‌కు చెందిన లాలం గోవిందమ్మ భర్త ఎల్‌బీ నాయుడు అధికార పార్టీ వైసీపీలో క్రియాశీలక నేత. కొంతకాలం వైసీపీ 96వ వార్డు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. స్థానిక ఎమ్మెల్యే వద్ద తన భర్తకు పలుకుబడి ఉందని, తన వద్ద చిట్టీలు వేస్తే అధిక లాభాలు వస్తాయని గోవిందమ్మ స్థానికులను నమ్మించింది. ఇందుకోసం ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటుచేసింది. దీంతో పలువురు ఆమె వద్ద చిట్టీలు కట్టడం ప్రారంభించారు. మొదట్లో అందరికీ సకాలంలో చెల్లింపులు చేస్తుండడంతో ఆమెపై నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఆమె నెలవారీ చిట్టీలతో పాటు పాటు సంక్రాంతి చిట్టీలను ప్రారంభించింది. కమీషన్ ఆశతో కొంతమంది మహిళలు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తమ బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో చిట్టీలను కట్టించారు. ఈ మొత్తం సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ఏడాదిగా గోవిందమ్మ నగదు చెల్లించకపోగా తప్పించుకుని తిరుగుతుండడంతో ఇటీవల స్థానిక పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె పెందుర్తిలో తమ కుటుంబానికి విలువైన స్థలాలున్నాయని, వాటిని విక్రయించి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. అయినా ఆ దిశగా చర్యలు కనిపించలేదు. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదంటూ నగదు చెల్లించకపోవడంతో గురువారం బాధితులంతా పెందుర్తిలోని ఆమె కార్యాలయానికి వెళ్లి నిలదీశారు. దీంతో ఆమె నగదు చెల్లించనని, దిక్కున్న వారికి చెప్పుకోవాలంటూ నిర్లక్ష్యంగా బదులివ్వడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
విచారణ చేపడతాం
చిట్టీల పేరిట సుమారు రూ.70 లక్షలు చెల్లించలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. లాలం కొండమ్మ, ఎల్బీనాయడు ఇద్దరూ చిట్టీల నిర్వహణలో భాగస్వాములేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడతాం.
- గొలగాని అప్పారావు, సీఐ, పెందుర్తి