హరహర మహాదేవ!

ABN , First Publish Date - 2023-02-18T01:09:12+05:30 IST

ముల్లోకాలకు ఆయన అధిపతి. సమస్త సృష్టికి కారణభూతుడు. చెయ్యెత్తి మొక్కితే అభయహస్తాన్ని అందించే ఆది దేవుడు. ఇలా... ఎంత వర్ణించినా.. ఎంత కీర్తించినా.. ఆ అమృతమూర్తికి తక్కువే.. సకల జనుల నుంచి అనునిత్యం పూజలందుకునే ఆ భోళాశంకరుని పండగకు వేళాయె. భక్తకోటి మనసారా ఆరాధించే పరమ పవిత్రమైన పుణ్యదినం రానే వచ్చింది. అదే మహాశివరాత్రి. ఈ వేడుకకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఆలయాలు పరమశివుని పూజలకు సిద్ధమయ్యాయి. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలైన పంచదార్ల, కల్యాణపులోవ, ధారమఠం, బలిఘట్టం, తదితర ప్రాంతాల్లోని ఆలయాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరగనున్నాయి.

హరహర మహాదేవ!
విద్యుద్దీపాలంకరణలో బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి

నేడే మహాశివరాత్రి

ప్రముఖ శైవక్షేత్రాల్లో భారీ ఏర్పాట్లు

పలు ఆలయాల్లో మూడు రోజులపాటు ఉత్సవాలు

కల్యాణపులోవ, ధారమఠం ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ముల్లోకాలకు ఆయన అధిపతి. సమస్త సృష్టికి కారణభూతుడు. చెయ్యెత్తి మొక్కితే అభయహస్తాన్ని అందించే ఆది దేవుడు. ఇలా... ఎంత వర్ణించినా.. ఎంత కీర్తించినా.. ఆ అమృతమూర్తికి తక్కువే.. సకల జనుల నుంచి అనునిత్యం పూజలందుకునే ఆ భోళాశంకరుని పండగకు వేళాయె. భక్తకోటి మనసారా ఆరాధించే పరమ పవిత్రమైన పుణ్యదినం రానే వచ్చింది. అదే మహాశివరాత్రి. ఈ వేడుకకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఆలయాలు పరమశివుని పూజలకు సిద్ధమయ్యాయి. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలైన పంచదార్ల, కల్యాణపులోవ, ధారమఠం, బలిఘట్టం, తదితర ప్రాంతాల్లోని ఆలయాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరగనున్నాయి.

మహాశివరాత్రి సందర్భంగా రావికమతం మండలంలోని కల్యాణపులోవలో శనివారం నుంచి మూడు రోజులపాటు జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ తిరునాళ్లకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తరలి రానుండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. జలాశయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బందితో రక్షణ చర్యలు చేపట్టారు. పోతురాజుబాబు, పెద్దింటమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు, భక్తులు ఎండబారిన పడకుండా తాటాకు పందిళ్లు, షామియానాలు వేశారు. భక్తులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం (అన్నసమారాధన) ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ నాయకులు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దొండపూడి జంక్షన్‌ నుంచి కల్యాణపులోవ వెళ్లే రోడ్డు వెడల్పు తక్కువగా వున్నందున వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించినట్టు కొత్తకోట సీఐ ఇలియాస్‌ అహ్మద్‌ చెప్పారు. ఆర్టీసీ బస్సులు, వీఐపీలు, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను దొండపూడి ఠాణా వరకే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

నర్సీపట్నంలోని బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మూడు రోజుల పాటు ఇక్కడ ఈ వేడుకలు జరగనున్నాయి. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు.

పంచదార్లలో...

రాంబిల్లి మండలం పంచదార్లలోని ఫణిగిరిపై వెలసిన ఉమాధర్మలింగేశ్వరస్వామికి శనివారం తెల్లవారుజామున ప్రథమ అభిషేకం నిర్వహిస్తామని ఆలయ పురోహితులు తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. మధ్యాహ్నం వరకు పూజలు, అభిషేకాలు, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. భక్తులు జాగరణ చేసిన తరువాత ఆదివారం ఉదయం ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, ఽధర్మలింగేశ్వరుడుని దర్శించుకుంటారని చెప్పారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నర్సీపట్నం, ఫిబ్రవరి 17: శివరాత్రి సందర్భంగా గొలుగొండ మండలం ధారమఠం, రావికమతం మండలం కల్యాణపులోవకు 19వ తేదీ ఉదయం వరకు 50 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు నర్సీపట్నం పీటీడీ డిపో మేనేజర్‌ ఎంఎస్‌ఎస్‌ ధీరజ్‌ తెలిపారు. నర్సీపట్నం, కొత్తకోట, రావికమతం నుంచి కల్యాణపులోవకు పదేసి చొప్పున 30 బస్సులు తిప్పుతామన్నారు. కొంతలం- కల్యాణపులోవ 3, కశిరెడ్డిపాలెం- కల్యాణపులోవ 2, నర్సీపట్నం- ధారమఠం 5, గొలుగొండ- ధారమఠం 5, కృష్ణాదేవిపేట- ధారమఠం 3, కంఠారం- ధారమఠం 2 బస్సులు నడుపుతామన్నారు.

అనకాపల్లి డిపో నుంచి...

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని కల్యాణపులోవ, విజయనగరం జిల్లా పుణ్యగిరికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డీపీటీవో పద్మావతి చెప్పారు. అనకాపల్లి నుంచి కల్యాణపులోవకు 35 బస్సులు, పుణ్యగిరికి పది బస్సులు నడపనున్నామన్నారు.

Updated Date - 2023-02-18T01:09:14+05:30 IST