ప్రియుడి కోసం తండ్రిపై చాకుతో దాడి!
ABN , First Publish Date - 2023-01-22T03:17:06+05:30 IST
ప్రియుడికి ఒక బాలిక రూ.2 లక్షలు, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఇంట్లో తెలియకుండా ఇచ్చింది.
సీతంపేట (విశాఖపట్నం): ప్రియుడికి ఒక బాలిక రూ.2 లక్షలు, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఇంట్లో తెలియకుండా ఇచ్చింది. ఈ విషయం తెలిసి నిలదీసిన తండ్రిపై చాకుతో దాడికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నం శంకరమఠం వెనుక వీధిలో ఓ కేటరింగ్ వ్యాపారి కుమార్తె, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య లేరు. కుమార్తె నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కళాశాలలో స్నేహితురాలి ద్వారా పరిచయమైన బాలుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె ఇంటి నుంచి దఫదఫాలుగా రూ.2 లక్షలు, 8 తులాల బంగారు ఆభరణాలు అతనికి ఇచ్చింది. ఈ విషయం తెలిసి తండ్రి కుమార్తెను నిలదీశాడు. దీంతో.. ఆమె ఈ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. ‘మీ నాన్నను ఏదో ఒకటి చేస్తే అడ్డు ఉండదు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా’ అని ప్రియుడు రెచ్చగొట్టాడు. దీంతో బాలిక శుక్రవారం ఉదయం చాకుతో తండ్రి మెడ వెనుక పొడిచింది. ఆయనకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరారు.