వెంకన్న కల్యాణం చూతము రారండి

ABN , First Publish Date - 2023-03-03T01:19:02+05:30 IST

ఏడాదికోసారి కలియుగ దైవం, కల్కీ అవతారంలో ఉపమాక క్షేత్రంలో వెలసిన స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి వైభవంగా నిర్వహిస్తారు.

వెంకన్న కల్యాణం చూతము రారండి
ఉపమాక ఆలయం

నేడు ఎదురుసన్నాహోత్సవం, రథోత్సవం, అనంతరం కల్యాణం

స్వర్ణాలంకరణలో స్వామి దర్శనం

నక్కపల్లి, మార్చి 2: ఏడాదికోసారి కలియుగ దైవం, కల్కీ అవతారంలో ఉపమాక క్షేత్రంలో వెలసిన స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి వైభవంగా నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ఉపమాక ఆలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం స్వామి కల్యాణం చేయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒక్కరోజే ఉభయదేవేరులతో కూడిన స్వామివారు బంగారు ఆభరణాలు, వజ్ర, వైడూర్యాలు, కలికితురాయి తదితర పసిడి ఆభరణాలతో స్వర్ణాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం కోసం ఏడాది పాటు వెంకన్న భక్తులు నిరీక్షిస్తుంటారు. శుక్రవారం ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోనుంది. మధ్యాహ్నం ధ్వజారోహణం జరుగుతుంది.

ఎదురుసన్నాహ మహోత్సవం చూసి తీరాల్సిందే

ఉపమాక క్షేత్రంలో కల్యాణోత్సవం రోజు రాత్రి జరిగే స్వామివారి ఎదురు సన్నాహ మహోత్సవాన్ని చూసేందుకు ఎంతోమంది నిరీక్షిస్తుంటారు. ఆద్యంతం ఈ ఉత్సవం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి డాక్టర్‌ గాయత్రీదేవి ఈ తంతు నిర్వహిస్తున్నారు. ఇత్తడి గరుడ వాహనంపై స్వామివారు, ఇత్తడి శేష తల్పంపై ఉభయదేవేరుల ఉత్సవమూర్తులను ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద ఎదురురెదురుగా వుంచుతారు. ఈ సందర్భంగా వధూవరుల గుణ,గణాలు, వారి వర్ఛస్సు, సౌశీలత..ఇలా అనేక అంశాలను డాక్టర్‌ గాయత్రీదేవి అందరికీ అర్థమయ్యేరీతిలో వివరిస్తారు. మధ్యలో ఆమె చెప్పే ఛలోక్తులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సాధారణంగా వివాహాలు కుదిరినప్పుడు పెండ్లి మాటలు ఎలా మాట్లాడతారో ? అదేవిధంగా ఇక్కడ దేవాదిదేవుడి పెండ్లిచూపులు, పెండ్లిమాటలు జరగడం విశేషం.

గోవింద నామస్మరణతో రథోత్సవం

ఎదురుసన్నాహ మహోత్సవం అనంతరం స్వామివారి రథోత్సవం జరుగుతుంది. మాడవీధుల్లో భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగుతారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి 1 గంట మధ్యలో ర థోత్సవం జరుగుతుంది. రథాన్ని కూడా అందుకు సిద్ధం చేశారు. రథంపై ఊరేగుతూ వచ్చిన స్వామిని భక్తులు దర్శించుకోవడానికి ఉవ్విళ్లూరుతారు.

కల్యాణోత్సవానికి ఏర్పాట్లు

ర థోత్సవం అనంతరం ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ వేదిక వద్ద శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలను కల్యాణం సమయంలో స్వామివారికి బహూకరిస్తారు. ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

Updated Date - 2023-03-03T01:19:02+05:30 IST