మినీ గోకులం సొమ్ము పక్కదారి
ABN , First Publish Date - 2023-05-22T01:04:23+05:30 IST
శెట్టిపాలెంలో బిల్లు అందని పశువుల షెడ్డుశెట్టిపాలెంలో బిల్లు అందని పశువుల షెడ్డుశెట్టిపాలెంలో బిల్లు అందని పశువుల షెడ్డుశెట్టిపాలెంలో బిల్లు అందని పశువుల షెడ్డు
మాకవరపాలెం మండలంలో రూ.కోటిన్నరకుపైగా హాంఫట్
మొత్తం 151 పశువుల షెడ్లకు మూడేళ్ల క్రితం బిల్లులు అప్‌లోడ్
రెండున్నరేళ్ల క్రితం సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజస్‌కు రూ.1,55,58,158 జమ
సొంత సొమ్ముతో షెడ్లు నిర్మించుకున్న రైతులు
డబ్బులేమో ప్రైవేటు కంపెనీకి విడుదల
ఆలస్యంగావెలుగు చూసిన వైనం
విస్మయం చెందుతున్న లబ్ధిదారులు
సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
మాకవరపాలెం, మే 21: మినీ గోకులం పథకం బిల్లులు మంజూరు ‘సొమ్మొకరిది.. సోకు మరొకరిది’ అన్న చందంగా వుంది. పలువురు రైతులు సొంత డబ్బులతో పశువుల షెడ్లు నిర్మించుకోగా, బిల్లుల డబ్బులు మాత్రం ఓ ప్రైవేటు ఏజెన్సీ ఖాతాకు జమఅయ్యాయి. ఒకటి, రెండు లక్షలు కాదు.. మొత్తం కోటిన్నర రూపాయలు దారి మళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు... సంబంధిత అధికారులను అడిగితే తమకేమీ తెలియదని, పాడేరు నుంచి బిల్లులు అప్‌లోడ్ అయ్యాయని చెబుతున్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రైతులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
రైతుల పాడి పశువులకు వసతి కోసం గత టీడీపీ ప్రభుత్వం 2018-19లో మినీ గోకులాల పథకాన్ని అమలు చేసింది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద మూడు కేటగిరీల్లో షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదించింది. రెండు పశువులకు షెడ్డు నిర్మాణం కోసం రూ.లక్ష, నాలుగు పశువులు అయితే రూ.1.5 లక్షలు, ఆరు పశువులు అయితే రూ.1.8 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. యూనిట్ విలువలో పది శాతం సొమ్మును రైతులు తమ వాటాగా చెల్లించి గోకులాల నిర్మాణ పనులు చేపట్టారు. కొద్ది మంది రైతులు వేగంగా షెడ్లు నిర్మించుకోవడంతో వారికి బిల్లులు మంజూరయ్యాయి. మిగిలిన షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో వుండగా సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీనాటికి 25 శాతంకన్నా తక్కువ పనులు జరిగిన మినీగోకులాల నిర్మాణ పనులు నిలిపివేయాలని, అంతకన్నా ఎక్కువ పనులు అయిన వాటిని పూర్తిచేయాలని, అసలు పనులు ప్రారంభించని వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల మేరకు మాకవరపాలెం మండలంలో షెడ్ల నిర్మాణం పూర్తిచేసిన 151 మంది రైతులకు బిల్లులు మంజూరు కావాల్సి వుంది. అయితే నెలలు గడుస్తున్నా బిల్లుల రాకపోవడంతో రైతులు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. పలువురు రైతులు స్పందనలో అర్జీలు అందజేశారు. ఇతర మండలాలకు చెందిన పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బిల్లులు మంజూరు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూనిట్ విలువలో 90 శాతం సొమ్ము ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయాలి. మండలంలో 151 మంది రైతులకు మొత్తం సుమారు కోటిన్నర రూపాయలు అందాల్సి వుంది. అయితే 2020 నవంబరు 10, 11 తేదీల్లో, 2021 జనవరి 11వ తేదీన మొత్తం రూ.1,55,58,158 సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజస్ పేరుమీద బిల్లులు మంజూరయ్యాయి. నర్సీపట్నం డివిజన్ పరిధిలో మినీ గోకులం షెడ్ల బిల్లులన్నీ అప్పట్లో పాడేరులో పనిచేసిన పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అప్‌లోడ్ చేశారని, ఆయన లబ్ధిదారుల పేర్ల స్థానంలో సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజస్ పేరును నమోదు చేసి వుంటారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు బిల్లులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
నా బిల్లును వేరే వాళ్లకు ఎలా మంజూరు చేస్తారు?
గొర్లి రాజులమ్మ, శెట్టిపాలెం
నాకు ఆరు పశువులు ఉన్నాయి. టీడీపీ ఆధికారంలో ఉన్నప్పుడు మినీ గోకులం పథకం కింద రూ.1.8 లక్షలతో షెడ్డు నిర్మాణం చేశాను. తరువాత ప్రభుత్వం మారడంతో బిల్లురాలేదు. ఈ మధ్య కాలంలో బిల్లులు వస్తున్నాయిని కొందరు చెప్పడంతో స్థానిక నాయకులను కలిశాను. నాకు రావాల్సిన రూ.1,44,701 సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజస్ పేరుమీద విడుదల అయినట్టు తెలిసింది. సొంత డబ్బులతో షెడ్డు నిర్మించుకుంటే, వేరే వాళ్ల పేరుమీద బిల్లు ఎలా మంజూరు చేశారో అర్థం కావడంలేదు.