అంగరంగ వైభవంగా మోదకొండమ్మ జాతర
ABN , First Publish Date - 2023-06-07T00:46:39+05:30 IST
మాడుగుల ప్రాంత ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు
అమ్మవారిని దర్శించుకున్న మాడుగుల సంస్థానం వారసులు, డిప్యూటీ సీఎం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
జనసంద్రంగా మారిన మాడుగుల
సాయంత్రం శతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలతో ఆలయానికి ఊరేగింపు
మాడుగుల, జూన్ 6: మాడుగుల ప్రాంత ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో మాడుగుల పట్టణం జనసంద్రంగా మారింది. తొలుత తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయంలో మోదకొండమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. అప్పటికే భక్తులు ఘాటాలను శిరస్సుపై వుంచుకుని క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని, ముడుపులు చెల్లించుకున్నారు. ఒకప్పటి మాడుగుల సంస్థానాధీశుల వారసుల కుటుంబ సభ్యులతోపాటు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు, మాడుగుల ఇన్‌చార్జి పీవీజీ కుమార్, చోడవరం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం వద్ద నుంచి సుమారు కిలోమీటరు దూరం మేర భక్తులు బారులు తీరారు. ఎండ బారిన పడకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు టెంట్లు వేయించారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు బస్టాండ్ ఆవరణం నుంచి అమ్మవారి ఆలయం వరకు మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దుర్గాలమ్మ ఆలయం వద్ద వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. కాగా నెల రోజుల క్రితం శతకం పట్టు వద్ద కొలువుతీర్చిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను తిరిగి ఆలయం వద్దకు చేర్చడానికి సాయంత్రం 6.35 గంటలకు ఊరేగింపు ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా పలు రకాల వేషధారణలు ప్రదర్శించారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను ఆలయానికి చేర్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని బస్టాండ్, దుర్గాలమ్మ ఆలయం, శతకంపట్టు పలు ప్రాంతాల్లో సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కె.కోటపాడు సీఐ తాతారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ పి.దామోదరనాయుడు బందోబస్తు ఏర్పాటు చేశారు.