జీలుగు కల్లు తాగి ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-02-08T01:25:13+05:30 IST
గూడెంకొత్తవీధి మండలం ఆకులూరు గ్రామంలో జీలుగు కల్లు తాగి ఇద్దరు గిరిజనులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గాలికొండ పంచాయతీ ఆకులూరు గ్రామంలో నివాసముంటున్న పాంగి రామదాసు(53), అతని కుమారుడు పాంగి లోవరాజు(25) ఒకే ఇంట్లో కుటుంబాలతో నివాసముంటున్నారు. రామదాసు ఇంటికి ఒడిశా నుంచి బంధువులైన కొర్ర బందు, దాలిమ దంపతులు ఆదివారం సాయంత్రం వచ్చారు.
- మరొకరి పరిస్థితి విషమం
- ఇద్దరూ తండ్రీకొడుకులు
- గాలికొండ పంచాయతీ ఆకులూరు గ్రామంలో ఘటన
చింతపల్లి/సీలేరు, ఫిబ్రవరి 7:
గూడెంకొత్తవీధి మండలం ఆకులూరు గ్రామంలో జీలుగు కల్లు తాగి ఇద్దరు గిరిజనులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గాలికొండ పంచాయతీ ఆకులూరు గ్రామంలో నివాసముంటున్న పాంగి రామదాసు(53), అతని కుమారుడు పాంగి లోవరాజు(25) ఒకే ఇంట్లో కుటుంబాలతో నివాసముంటున్నారు. రామదాసు ఇంటికి ఒడిశా నుంచి బంధువులైన కొర్ర బందు, దాలిమ దంపతులు ఆదివారం సాయంత్రం వచ్చారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున ఇంటికొచ్చిన అతిథులకు మర్యాదపూర్వకంగా కల్లు ఆతిథ్యంగా ఇవ్వాలని రామదాసు భావించాడు. కుమారుడు లోవరాజును ప్రతి రోజూ కల్లు సేకరించే జీలుగు చెట్ల వద్దకు పంపించాడు. ప్లాస్టిక్ క్యాన్‌లో తీసుకొచ్చిన కల్లును పొయ్యిపై కాస్త వేడి చేసుకుని రామదాస్, కుమారుడు లోవరాజు, కొర్ర బందు, దాలిమాలు తాగారు. కొంత సేపటికి ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయితే రామదాసు, లోవరాజుకు ఎక్కువగా వాంతులు, విరేచనాలు కావడంతో మధ్యాహ్నం సప్పర్ల ఆస్పత్రికి బంధువులు తీసుకొచ్చారు. ఆ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే చింతపల్లి ఏరియా ఆస్పత్రికి పంపించారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు. మంగళవారం తెల్లవారుజామున లోవరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామదాసును మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఐదేళ్లలోపు కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా రామదాసు, లోవరాజులతో కలిసి కల్లు సేవించిన ఒడిశాకు చెందిన బందు, దాలిమాలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సంఘటనపై ఎస్‌ఐ ఆరా
జీలుగు కల్లు తాగి ఒకరు మృతి చెందారని తెలిసి ఎస్‌ఐ రామకృష్ణ మంగళవారం ఆకులూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై ఆరా తీశారు. ఆకులూరు గ్రామానికి వెళ్లే క్రమంలో కల్లు క్యాన్లతో వస్తున్న గిరిజనులను ఆపి అందులో ఏ విధమైన మత్తు పదార్థాలు కలుపుతారో అడిగి తెలుసుకున్నారు. మత్తు పదార్థాలను కల్లులో కలపడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అలా చేయవద్దని గిరిజనులను ఆయన హెచ్చరించారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
- మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణ
చింతపల్లి: జీలుగు కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న రామదాసు, లోవరాజును చింతపల్లి ఏరియా ఆస్పత్రికి సోమవారం సాయంత్రం తరలిస్తే అక్కడ సరైన వైద్య సేవలు అందక లోవరాజు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే బలితీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం ఉదయం లోవరాజు మృతి చెందడంతో హడావిడిగా తొమ్మిది గంటల సమయంలో రామదాసును వైద్యులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారని వాపోయారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి వెంటనే మెరుగైన చికిత్స కోసం మైదాన ప్రాంతానికి తరలించి ఉంటే లోవరాజు బతికి ఉండేవాడని అతని భార్య సునీత, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా వారు తాగిన జీలుగు కల్లులో విషపూరితమైన అవశేషాలు కలిసి ఉంటాయని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.