మర్రిపాలెం చెక్‌ పోస్టుపై అటవీ శాఖలో పంచాయితీ!

ABN , First Publish Date - 2023-06-17T00:16:28+05:30 IST

నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారిలో వున్న మర్రిపాలెం అటవీశాఖ చెక్‌ పోస్టు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అటవీ అధికారుల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని మర్రిపాలెం చెక్‌ పోస్టు చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి వెళ్లి పోయింది.

మర్రిపాలెం చెక్‌ పోస్టుపై అటవీ శాఖలో పంచాయితీ!
మర్రిపాలెంలో అటవీ చెక్‌ పోస్టు

తమదంటే తమదంటున్న రెండు జిల్లాల అధికారులు

భౌగోళికంగా అల్లూరి జిల్లా చింతపల్లి డివిజన్‌ పరిధిలో చెక్‌పోస్టు

జిల్లాల పునర్విభనకు ముందు గొలుగొండ మండలం నుంచి మర్రిపాలెం తరలింపు

అందువల్ల తమ డివిజన్‌కే చెందుతుందంటున్న నర్సీపట్నం అధికారులు

సీసీఎఫ్‌ చెప్పినా బేఖాతరు

మర్రిపాలెం చెక్‌స్టు కాసులు పంట పండించడమే కారణమన్న ఆరోపణలు

నర్సీపట్నం, జూన్‌ 16: నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారిలో వున్న మర్రిపాలెం అటవీశాఖ చెక్‌ పోస్టు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అటవీ అధికారుల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని మర్రిపాలెం చెక్‌ పోస్టు చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి వెళ్లి పోయింది. అయితే అనకాపల్లి జిల్లా అటవీ అధికారి, నర్సీపట్నం రేంజర్‌.. తమ సిబ్బందితో ఈ చెక్‌ పోస్టును నిర్వహించడం వివాదాస్పదమైంది. మర్రిపాలెం చెక్‌ పోస్టు తమదంటే తమదని చింతపల్లి, నర్సీపట్నం అటవీ అధికారులు వాదులాడుకుంటున్నారు. దీనిపై సీసీఎఫ్‌ సీరియస్‌ అయినప్పటికీ నర్సీపట్నం అధికారులు వెనక్కు తగ్గడంలేదు. ఈ చెక్‌ పోస్టుపై నర్సీపట్నం అటవీ శాఖ అధికారులకు అంత మమకారం ఎందుకని ఆరా తీయగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

జిల్లాల పునర్విభజనకు ముందు నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో (నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారిలో) అటవీశాఖ చెక్‌ పోస్టు ఉండేది. సీలేరు, చింతపల్లి ప్రాంతాల నుంచి టేకు కలపను మైదాన ప్రాంతానికి అక్రమంగా రవాణా చేయాలంటే ఈ చెక్‌ పోస్టు ఆటంకంగా మారింది. దీంతో అక్రమార్కులు డౌనూరు- ఏటిగైరంపేట మధ్య మర్రిపాలెం వద్ద కుడి వైపున రోడ్డులోకి మళ్లి జోగుంపేట, కృష్ణాదేవిపేట, బాలారం మీదుగా టేకు కలపను తరలించేవారు. ఇది అటవీ శాఖ అధికారుల దృష్టికి రావడంతో 12 సంవత్సరాల క్రితం ఏటిగైరంపేట చెక్‌ పోస్టును మర్రిపాలెం జంక్షన్‌కు మార్చారు. జిల్లా పునర్విభజన తర్వాత మర్రిపాలెంలోని చెక్‌ పోస్ట్‌ భౌగోళికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. నిబంధనల ప్రకారం ఇక్కడ ఆ డివిజన్‌ సిబ్బంది విధులు నిర్వహించాలి. కానీ నర్సీపట్నం అటవీ అధికారులు తమ సిబ్బందిని అక్కడ వుంచి అనధికారికంగా చెక్‌ పోస్టు నిర్వహిస్తున్నారు. దీనిపై చింతపల్లి డీఎఫ్‌వో సూర్యనారాయణ పడాల్‌ అనకాపల్లి జిల్లా అటవీ అధికారికి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మర్రిపాలెం చెక్‌ పోస్టు పంచాయితీ విశాఖపట్నంలోని కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారి వద్దకు వెళ్లింది. మర్రిపాలెం చెక్‌ పోస్టు చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి వెళ్లినప్పుడు, మీరెందుకు సిబ్బందిని పెట్టి నడుపుతున్నారని నర్సీపట్నం అటవీ అధికారులను నిలదీసినట్టు తెలిసింది. ఆయినప్పటికీ నర్సీపట్నం రేంజర్‌, డీఎఫ్‌వో పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ వసూళ్లకు కేరాఫ్‌ మర్రిపాలెం చెక్‌పోస్టు

ఏజెన్సీ నుంచి గంజాయి, రోజ్‌ ఉడ్‌తో తయారు చేసిన అక్రమ ఫర్నిచర్‌ మైదాన ప్రాంతానికి మర్రిపాలెం చెక్‌ పోస్టు మీద నుంచే తరలించాలి. చెక్‌ పోస్టు వద్ద విధుల్లో వుండే అటవీ సిబ్బంది భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని గంజాయి అక్రమ రవాణాకు సహకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా సీలేరు సమీపంలోని ఒడిశా ప్రాంతం నుంచి రోజ్‌వుడ్‌తో తయారు చేసిన ఫర్నీచర్‌ ఏజెన్సీ మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఇంకా టేకు కలపతో తయారు చేసిన మంచాలు, డైనింగ్‌ టేబుళ్లు, దివాన్‌ కాట్‌లు వంటివి కూడా రవాణా చేస్తుంటారు. అక్రమార్కుల నుంచి అధిక మొత్తంలో మామూళ్లు తీసుకుని నామమాత్రపు సీ ఫీజు వసూలు చేసి వదిలేస్తుంటారు. మర్రిపాలెం చెక్‌ పోస్టు అక్రమ ఆదాయానికి చిరునామాగా మారిందని అటవీ శాఖలో చెప్పుకుంటుంటారు. కామధేనువు వంటి మర్రిపాలెం చెక్‌పోస్టును వదులుకోవడం ఇష్టంలేక నర్సీపట్నం అటవీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-06-17T00:16:28+05:30 IST