రంపచోడవరం ఎమ్మెల్యేకి నిరసన సెగ

ABN , First Publish Date - 2023-04-17T01:16:35+05:30 IST

బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని మర్రిపాలెం గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని ఆదివాసీ జేఏసీ నేతలు ఆదివారం అడ్డుకున్నారు. చెరుకుంపాలెం పంచాయతీ వెలగలపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న ఆమెను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా ఆందోళనకారులు తాటి దుంగలు వేశారు.

రంపచోడవరం ఎమ్మెల్యేకి నిరసన సెగ
ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆదివాసీ జేఏసీ నేతలు

- ధనలక్ష్మిని అడ్డుకున్న ఆదివాసీలు

- బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేయడంపై నిరసన

- ఆదివాసీ ద్రోహి అంటూ నినాదాలు

- ఆందోళనకారులను నిలువరించిన పోలీసులు

రాజవొమ్మంగి, ఏప్రిల్‌ 16: బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని మర్రిపాలెం గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని ఆదివాసీ జేఏసీ నేతలు ఆదివారం అడ్డుకున్నారు. చెరుకుంపాలెం పంచాయతీ వెలగలపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న ఆమెను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా ఆందోళనకారులు తాటి దుంగలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తాటి దుంగలను తొలగించారు. ఆ తరువాత ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మర్రిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ నాయకులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు ఆధ్వర్యంలో ఆందోళనకారులు ఆమెను నిలదీశారు. జీవో నెం.52పై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ గతంలో కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, అయితే అప్పుడు వైసీపీలో నెగ్గి టీడీపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం నాలుగు జిల్లాల్లో ఉన్న బోయ వాల్మీకిలను మాత్రమే ఎస్టీ జాబితాలో కలుపుతామని చెబుతోందని, టీడీపీ నాయకులు మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వారిని కలుపుతామని చెప్పారని, ఇది గమనించాలన్నారు. ఈ మాటలు విన్న ఆదివాసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేదని గిరిజనుల హక్కుల కోసం మాట్లాడుతున్నామన్నారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే ధనలక్ష్మికి, ఆదివాసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆదివాసీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేశారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ‘వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆదివాసీ ద్రోహి’ అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేతలు గొల్లపూడి పెద్దిరాజు, వజ్రపు అప్పారావు, తెడ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-17T01:16:35+05:30 IST