కేజీహెచ్‌లో ఆరు బృందాలతో ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2023-02-11T01:01:07+05:30 IST
కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, సమయ పాలన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ఉద్దేశంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆరు వైద్య బృందాలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాయి.

ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ విభాగాలు, వార్డులు సందర్శన
విశాఖపట్నం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, సమయ పాలన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ఉద్దేశంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆరు వైద్య బృందాలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాయి. సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంవోలు, ఏఆర్‌ఎంవోలతో కూడిన వైద్య బృందాలు ఓపీ విభాగాలు, క్యాజువాల్టీ, భావనగర్, రాజేంద్రప్రసాద్, పీడియాట్రిక్, ఆర్థో, గ్యాస్ర్టో ఎంట్రాలజీ తదితర విభాగాలను పరిశీలించి అక్కడ అందున్న వైద్య సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా విభాగాల్లో హాజరుకాని సిబ్బంది, సమయపాలన పాటించని వైద్యులు తదితర వివరాలను సేకరించారు. ఉదయం 9:30 గంటలు నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆకస్మిక తనిఖీలు కోసం బృందాలను నియమించారని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్టు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.