ఆర్‌ఈసీఎస్‌ ఆదాయం అదుర్స్‌

ABN , First Publish Date - 2023-04-13T01:36:06+05:30 IST

కశింకోట కేంద్రంగా పనిచేస్తున్న గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ(ఆర్‌ఈసీఎస్‌)ను ఈపీడీసీఎల్‌కు అప్పగించిన తరువాత నికర ఆదాయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వసూలైన బిల్లులకు, అక్కడి సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. అంటే అక్కడ మంచి లాభాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అందుకే ఆ సంస్థను వదిలిపెట్టకుండా మళ్లీ దక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు తీవ్రంగా యత్నిస్తున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ ఆదాయం అదుర్స్‌

ఈపీడీసీఎల్‌కు అప్పగించిన ఈ 16 నెలల్లో రూ.158.41 కోట్లు రాక

అంతకు ముందు 48 నెలల ఆదాయం రూ.277.76 కోట్లు మాత్రమే

తప్పుడు లెక్కలు చూపించినట్టు ఆరోపణలు

నిధులు పక్కదారి పట్టించారనే అనుమానాలు

విచారణ లేకుండా కాలయాపన

సంస్థను మళ్లీ వెనక్కి ఇవ్వాలని కొన్నాళ్లుగా ఒత్తిళ్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కశింకోట కేంద్రంగా పనిచేస్తున్న గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ(ఆర్‌ఈసీఎస్‌)ను ఈపీడీసీఎల్‌కు అప్పగించిన తరువాత నికర ఆదాయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వసూలైన బిల్లులకు, అక్కడి సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. అంటే అక్కడ మంచి లాభాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అందుకే ఆ సంస్థను వదిలిపెట్టకుండా మళ్లీ దక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు తీవ్రంగా యత్నిస్తున్నారు.

కేంద్ర విధానం, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థలకు లైసెన్స్‌లు పునరుద్ధరించకూడదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఆ ప్రకారం కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను సహకార సంస్థ నుంచి తప్పించి 2021 సెప్టెంబరులో ఈపీడీసీఎల్‌కు అప్పగించింది. నాటి నుంచి అక్కడి వ్యవహారాలన్నీ ఈపీడీసీఎల్‌ అధికారులే చూస్తున్నారు. విద్యుత్‌ సరఫరా చేస్తూ, బిల్లులు వసూలు చేస్తున్నారు. స్థానిక మంత్రి ఒత్తిడి మేరకు ప్రభుత్వం దీనిని వెనక్కి ఇవ్వాలని ఏపీఈఆర్‌సీకి గత ఏడాది మేలో లేఖ రాసింది. దానిపై నిర్ణయం తీసుకోకముందే సంస్థ ఎండీ రామకృష్ణరాజు గీత దాటి సిబ్బంది ద్వారా బిల్లులు వసూలు చేపట్టి ప్రత్యేక ఖాతాల్లో జమ చేయించారు. ఇలా రెండు నెలలు (జూన్‌, జులై) చేశారు. దీనిపై ఆగ్రహించిన ఏపీఈఆర్‌సీ సుమోటోగా కేసు నమోదు చేసి ఆ డబ్బులన్నీ వెనక్కి కట్టించింది. ఎండీని కూడా మందలించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022తో ముగిసిన డిసెంబరు వరకు 16 నెలలకు ఆర్‌ఈసీఎస్‌ నుంచి 158.41 కోట్ల మొత్తం ఈపీడీసీఎల్‌ బిల్లుల రూపంలో వసూలు చేసింది. ఇందులో నెలకు సుమారు మూడు కోట్ల రూపాయలు జీతాల రూపంలో చెల్లించింది. అంటే 16 నెలలకు సుమారు రూ.50 కోట్లు జీతాలుగా ఇచ్చింది. మిగిలిన మొత్తంలో వినియోగించిన విద్యుత్‌ బిల్లును తీయగా మంచి లాభాలే వచ్చాయని ఈపీడీసీఎల్‌ వర్గాలు వివరించాయి. ఈ లాభం కోట్లలోనే ఉందని, అది కూడా రెండు అంకెల్లో ఉందని సమాచారం.

ఇదే సమయంలో గతంలో సహకార సంస్థ ఆధ్వర్యాన నడిచినప్పుడు లెక్కలు చూస్తే...ఏప్రిల్‌-మార్చి ఆర్థిక సంవత్సరం ప్రకారం 2014-15లో రూ.61.39 కోట్లు, 2015-16లో రూ.67.16 కోట్లు, 2016-17లో రూ.66.33 కోట్లు, రూ.2017-18లో రూ.82.87 కోట్లు ఆదాయం చూపించారు. మొత్తం ఈ నాలుగేళ్ల లెక్కలు పరిశీలిస్తే...రూ.277.75 కోట్లుగా చూపించారు. కేవలం పదహారు నెలకు ఈపీడీసీఎల్‌ రూ.158 కోట్ల వసూళ్లు చూపిస్తే...దానికి రెండు రెట్లు అంటే రూ.48 నెలలకు రూ.277.75 కోట్లుగా చూపించడం వెనుక అనేక అక్రమాలు దాగి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది లాభాలను లెక్కల్లో చూపించకుండా..రకరకాల ఖర్చులు చూపించి బ్యాంకు ఖాతాల్లో నిధులు కాజేశారని అనకాపల్లి ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా గత పదేళ్ల కాలంలో సుమారు రూ.500 కోట్ల నిధులు పక్కదారి పట్టించారని, దీనిపై విచారణకు డిమాండ్‌ చేస్తున్నట్టు జనసేన నాయకులు గోపి తెలిపారు. ఈ విధంగా మళ్లీ కోట్లాది రూపాయలు కాజేయడానికే సొసైటీకి ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారని, ప్రభుత్వం, ఈఆర్‌సీ అందుక అంగీకరించకూడదన్నారు.

Updated Date - 2023-04-13T01:36:06+05:30 IST