వేల్పుల వీధిలో సందడి

ABN , First Publish Date - 2023-01-21T00:59:18+05:30 IST

పట్టణంలోని వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేల్పుల వీధిలో సందడి
వేల్పులవీధిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గౌరీపరమేశ్వరుల ఆలయం

భారీ ఏర్పాట్లు చేపట్టిన నిర్వాహకులు

విద్యుద్దీపాలతో మెయిన్‌రోడ్డు ధగధగలు

ఏ ఇల్లు చూసినా బంధువులతో కళకళ

అనకాపల్లి టౌన్‌, జనవరి 20 : పట్టణంలోని వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేకువజాము నుంచి పూజలు ప్రారంభం కానున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొద్దపు ప్రసాద్‌ తెలిపారు. కమిటీ ప్రతినిధులు దామరౌతు రవిశంకర్‌, రౌతు సతీష్‌, యడ్ల గోవిందరావు, బాసూరి ఉమామహేశ్వరరావు, కరణం గౌరీసు, మద్దాల చిరంజీవిరమణ, వీధి పెద్దల పర్యవేక్షణలో ఉత్స వాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుక సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఇక్కడికి చేరుకోవడంతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది.

పలు చోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు

రాత్రికి పలుచోట్ల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎస్‌బీఐ వద్ద డేర్‌ డ్యాన్స్‌, పూడిమడక రోడ్డులో ధమాకా డ్యాన్స్‌ నైట్‌, జార్జిక్లబ్‌ వద్ద మనల్ని ఎవర్రా ఆపేది డ్యాన్స్‌ షో, రామచంద్ర థియేటర్‌ వద్ద డ్యాన్స్‌ ఐకాన్‌, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌లో పవర్‌ నైట్‌ డ్యాన్స్‌ షో, మళ్లవరపువారివీధి వద్ద రేలారే... రేలారే.., జీవీఎంసీ కార్యాలయం వద్ద విశాఖ వారి ఆర్కెస్ట్రా, శారదాబ్రిడ్జి వద్ద గాజువాక వారి ఆలాపన ఆర్కెస్ట్రా, నెహ్రూచౌక్‌ బస్టాప్‌ వద్ద ప్రేమ్‌కుమార్‌ ఆర్ట్స్‌ మార్టేరు వారి సినీ నృత్య ప్రదర్శన, చిననాలుగురోడ్ల జంక్షన్‌లో బాలనాగమ్మ బుర్రకథ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ వద్ద డూప్స్‌ బాబోయ్‌ డూప్స్‌, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద న్యూ బాలనాగమ్మ బుర్రకథ వంటి సాంస్కృతిక కార్యక్రమాల కోసం వేదికలను సిద్ధం చేస్తున్నారు. వివిధ రకాల నేలవేషాలను కూడా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటలకు భారీ ఎత్తున బాణసంచా కాల్చనున్నారు.

ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు

ఉత్సవంలో పట్టణ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన జంక్షన్లలో పికెట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. విశాఖ మీదుగా అనకాపల్లికి వచ్చే బస్సులు జాతీయ రహదారి మీదుగా పూడిమడకరోడ్డులోని కాంప్లెక్స్‌కు చేరేలా చర్యలు తీసుకున్నారు. అలాగే విజయనగరం, చోడవరం ప్రాంతాల నుంచి వచ్చిపోయే బస్సులు రింగురోడ్డు, వన్‌ వే ట్రాఫిక్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ వైద్యాలయం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకునే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-01-21T00:59:32+05:30 IST