తవ్వుకో.. అమ్ముకో..!
ABN , First Publish Date - 2023-03-10T00:33:49+05:30 IST
శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనకాపల్లి మండలం తగరంపూడి సమీపంలో శారదా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అండగా వుండడంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అంటూ టైరు బండ్లతో సమీపంలోని ఖాళీ స్థలాల్లోకి తరలించి నిల్వ చేస్తున్నారు. చీకటి పడిన తరువాత ట్రాక్టర్లలోకి లోడింగ్ చేసి అనకాపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ ఆరు వేల నుంచి పది రూపాయల వరకు అమ్ముతున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.
పలుచోట్ల ఇష్టారాజ్యంగా తవ్వకాలు
అధికార పార్టీ నేతల అండదండలు
జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో గమ్యస్థానాలకు తరలింపు
రాత్రిపూట ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా
ఒక్కో లోడు రూ.6-10 వేలకు అమ్మకం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనకాపల్లి మండలం తగరంపూడి సమీపంలో శారదా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అండగా వుండడంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అంటూ టైరు బండ్లతో సమీపంలోని ఖాళీ స్థలాల్లోకి తరలించి నిల్వ చేస్తున్నారు. చీకటి పడిన తరువాత ట్రాక్టర్లలోకి లోడింగ్ చేసి అనకాపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ ఆరు వేల నుంచి పది రూపాయల వరకు అమ్ముతున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.
జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వపరంగా అనుమతులు లేవు. ప్రైవేటు భవన నిర్మాణాలకు అవరమైన ఇసుకను ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు డిపోల నుంచి కొనుగోలు చేసుకోవాలి. జగనన్న ఇళ్ల కాలనీలకు అయితే ఉచితంగానే ఇవ్వాలి. అయితే డిపోలకు ఇసుక సరఫరా అంతంతమాత్రంగానే వుండడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో లభ్యతనుబట్టి ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే సమీప సచివాలయంలో అనుమతి తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. శారదా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. తగరంపూడి గ్రామానికి సమీపంలో శారదా నదిలో రెండు చోట్ల (నందవరపు వారి వీధికి సమీపంలో, కాలువ గట్టు వద్ద) గత వారం రోజుల నుంచి ఇసుక సేకరిస్తున్నారు. బెల్లం పెనాలతో నది మధ్యలోకి వెళ్లి, ఇసుకను సేకరించి ఒడ్డుకు చేరుస్తున్నారు. ఇక్కడి నుంచి ఎడ్ల బండ్లతో భవన నిర్మాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా రాత్రిపూట ట్రాక్టర్లలోకి లోడింగ్ చేసి అనకాపల్లితోపాటు మండలంలోని పలు గ్రామాలకు రవాణాచేస్తున్నారు. ఒక్కో లోడుకు దూరాన్నిబట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇసుక అక్రమార్కులకు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అండగా వున్నట్టు చెప్పుకుంటున్నారు.
బొడ్డేరు గెడ్డలో...
గొలుగొండ, మార్చి 9: మండలంలోని చోద్యం పంచాయతీ పరిధిలో వున్న బొడ్డేరు గెడ్డలో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాండవ రిజర్వాయర్‌కు ఎగువున వుండడంతో ఇక్కడ నాణ్యమైన ఇసుక లభిస్తుంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇక్కడి నుంచే ఇసుక తరలిస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, ఎస్‌ఈబీ అధికారులు పట్టించుకోవడంలేదు. పట్టపగలు మండల కేంద్రం మీదుగా.. అందులోనూ స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కార్యాలయం ముందు నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నప్పటికీ తనిఖీలు చేసిన పాపానపోలేదు. గురువారం మధ్యాహ్నం ఇసుక ట్రాక్టర్ ఎస్‌ఈబీ కార్యాలయం ఎదుట గోతిలో కూరుకుపోయింది. సుమారు రెండుగంటల వరకు దీనిని బయటకు తీయలేదు. అయినా సరే ఎస్‌ఈబీ అధికారులు పట్టించుకోలేదు. ఇంకా చీడిగుమ్మల, గుండుపాల వద్ద వరహా నదిలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.