వలంటీర్లకు ఉన్న గౌరవం సర్పంచ్‌కు లేదు
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:47 AM
వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, గ్రామ వలంటీర్లకు ఉన్న గౌరవం సర్పంచులకు లేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
వలంటీర్లకు ఉన్న గౌరవం సర్పంచ్‌కు లేదు
- పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం
- రాష్ట్ర నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించిన వైసీపీ సర్కారు
- రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్
కె.కోటపాడు, డిసెంబరు 23: వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, గ్రామ వలంటీర్లకు ఉన్న గౌరవం సర్పంచులకు లేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చౌడువాడ గ్రామంలోని రిసార్ట్స్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచుల భాగస్వామ్యం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులకు విధులు, నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్రం నుంచి రావలసిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయలను దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరగకపోవడానికి కారణం సర్పంచులు, ఎంపీటీసీలు కాదని రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు ఇవ్వకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గ్రామాల్లో గ్రామ వలంటీర్లను, గృహ సారథులను నియమించి వారి ద్వారా పరిపాలన సాగిస్తున్నారే తప్ప ఇందులో ప్రజల ద్వారా గెలుపొందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఏమీ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ సర్పంచులు స్వేచ్ఛగా గ్రామాల్లో తిరగకుండా ముఖం చాటేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాలు మాట్లాడుతూ పంచాయతీ నిధులు దోచుకుంటున్న ఈ ముఖ్యమంత్రికి గ్రామీణ ప్రాంత ప్రజల ఉసురు తగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం నాయకులు వినోద్‌రాజ్, రామకృష్ణనాయుడు, చుక్క ధనుంజయ యాదవ్, చంద్రశేఖర్, సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, జనసేన మండల నాయకులు కుంచా అంజిబాబు, చల్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు