సెబ్, ఎక్సైజ్ ప్రక్షాళన
ABN , First Publish Date - 2023-08-04T00:43:53+05:30 IST
జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో (సెబ్), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, శాఖల్లో ఇంటి దొంగలపై ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇటీవల మాడుగుల మండలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒడిశా మద్యం వెనుకు ఓ ఇన్‌స్పెక్టర్ పాత్ర వుందని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి డిప్యూటేషన్‌పై అనకాపల్లి వచ్చిన అతనిని తిరిగి విశాఖ కార్యాలయానికి సరెండర్ చేశారు. విశాఖ అధికారులు అతనికి ఎక్కడా పోసింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో వుంచినట్టు తెలిసింది. ఇదిలావుండగా గత ఏడాది కాలంగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పట్టుబడిన ఇతర రాష్ట్రాల మద్యం కేసులపై మరింత లోతుగా విచారణ జరపాలని జిల్లా అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
అధికారులు దిద్దుబాటు చర్యలు
ఇంటి దొంగలపై ప్రత్యేక దృష్టి
మద్యం, గంజాయి, ఇసుక కేసుల్లో తాత్సారం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
గాదిరాయిలో పట్టుకున్న ఒడిశా మద్యంపై లోతుగా విచారణ
సెబ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ
డిప్యూటేషన్ రద్దు.. తిరిగి విశాఖకు సరెండర్
ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచిన విశాఖ అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో (సెబ్), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, శాఖల్లో ఇంటి దొంగలపై ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇటీవల మాడుగుల మండలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒడిశా మద్యం వెనుకు ఓ ఇన్‌స్పెక్టర్ పాత్ర వుందని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి డిప్యూటేషన్‌పై అనకాపల్లి వచ్చిన అతనిని తిరిగి విశాఖ కార్యాలయానికి సరెండర్ చేశారు. విశాఖ అధికారులు అతనికి ఎక్కడా పోసింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో వుంచినట్టు తెలిసింది. ఇదిలావుండగా గత ఏడాది కాలంగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పట్టుబడిన ఇతర రాష్ట్రాల మద్యం కేసులపై మరింత లోతుగా విచారణ జరపాలని జిల్లా అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయించి అమ్మకాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ధరలు చాలా అధికంగా వుండడంతోపాటు ఊరూపేరూ లేని బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్నారు. పక్కనున్న ఒడిశాతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు రెట్టింపు వున్నాయి. దీంతో కొంతమంది వ్యక్తులు ఒడిశా నుంచి అక్రమంగా నుంచి మద్యం తెచ్చి, జిల్లాలో దొంగచాటుగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సెబ్ శాఖలకు చెందిన కొంతమంది ఉద్యోగులు దీనిని పసిగట్టి.. అక్రమ మద్యం వ్యాపారంలోకి దిగారు. ఒడిశాలోని డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం కొనుగోలు చేసి జిల్లాకు రప్పిస్తున్నారు. దారిలో చెక్‌పోస్టుల సిబ్బందిని ‘మేనేజ్’ చేస్తున్నారు. ఒడిశా నుంచి రప్పించిన మద్యాన్ని మారుమూల గ్రామాల్లో నిల్వ చేసి, చుట్టుపక్కల మండలాల్లో బెల్ట్ షాపులకు (కిల్లీ షాపులు, చిన్నపాటి కిరాణా దుకాణాలు) సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ మద్య షాపుల్లోనే అనధికారికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 16న మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో పోలీసులు దాడులు చేసి రూ.13 లక్షల విలువ చేసే ఒడిశా మద్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మద్యం సీసాలపై ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే మంజీరా బ్రాండ్ మద్యం సీసాల బ్యాచ్ నంబర్లు ఉండడం మరింత లోతుగా దర్యాప్తు చేశారు. రాయగడలోని డిస్టిలరీ నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు రప్పించినట్టు నిర్ధారణ అయ్యింది. దీనివెనుక సెబ్‌కు ఒక ఇన్‌స్పెక్టర్ పాత్ర వున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, సెబ్ జిల్లా జాయింట్ కమిషనర్ విజయభాస్కర్‌ల నేతృత్వంలో పోలీసు, ఎక్సైజ్, సెబ్ విభాగాల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టారు. గత ఏడాది కాలంగా జిల్లాలో పలు మండలాల్లో పట్టుబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యానికి సంబంధించిన కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆయా కేసుల్లో నిందితులు ఎవరు? పోలీసు, ఎక్సైజ్, సెబ్ శాఖల్లో ఎవరితోనైనా వీరికి సంబంధాలు వున్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అనుమానిత ఉద్యోగుల కదలికలపై నిఘా పెట్టినట్టు తెలిసింది. మరోవైపు ఇతర రాష్ట్రాల మద్యాన్ని పట్టుకున్నప్పుడు కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం చేస్తున్న అధికారులకు చార్జిమెమోలు ఇవ్వాలని పోలీసు ఉన్నాతాధికారి ఆదేశించినట్టు సమాచారం.
ఇన్‌స్పెక్టర్ సరెండర్
మాడుగుల మండలం గాదిరాయిలో పట్టుబడిన ఒడిశా మద్యం కేసును సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తున్న అధికారులు.. దీనికి వెనుక సెబ్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ పాత్ర వున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. విశాఖపట్నం సెబ్ నుంచి డిప్యూటేషన్‌పై అనకాపల్లి వచ్చిన ఈ ఇన్‌స్పెక్టర్‌ను తిరిగి విశాఖకు సరెండర్ చేశారు. అక్కడి అధికారులు సదరు ఇన్‌స్పెక్టర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో వుంచినట్టు సమాచారం. ఈ వ్యవహారం తరువాత పోలీసు, ఎక్సైజ్, సెబ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మద్యం, గంజాయి, ఇసుక వంటివి అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడితే వెంటనే కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించినట్టు సమాచారం.