శ్రావణం దోపిడీ
ABN , First Publish Date - 2023-08-25T01:08:18+05:30 IST
శ్రావణ మాసం వచ్చిందంటే బంగారం షాపులకు పండగే. మధ్య తరగతి ప్రజల విశ్వాసాన్ని భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి.
గ్రాము కాసుకు రూ.6,257 వసూలు
ప్రస్తుతం మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర గ్రాము రూ.5,450
గ్రాముకి రూ.600 అధికం...
పట్టించుకోని యంత్రాంగం
రెండో శుక్రవారం కావడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలు
డజను అరటి పండ్లు రూ.100-రూ.150
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శ్రావణ మాసం వచ్చిందంటే బంగారం షాపులకు పండగే. మధ్య తరగతి ప్రజల విశ్వాసాన్ని భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసినప్పుడు ఏదో ఒక బంగారు నగ...లేకుంటే స్థాయికి తగినట్టు ఒక కాసు అయినా కొత్తది పెట్టి పూజ చేయడం రివాజు. అదే బంగారం షాపులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సాధారణ రోజుల కంటే శ్రావణ మాసంలో సహజంగానే బంగారం ధర పెరుగుతుంది. గురువారం నాటి మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర గ్రాము రూ.5,450గా బులియన్ మార్కెట్ నిర్ణయించింది. దీనితోనే కాసులు తయారుచేస్తారు. గ్రాము కాసు తయారు చేయడానికి (మజూరీ) రూ.100 కంటే ఎక్కువ కాదు. దీనిపై జీఎస్‌టీ 3 శాతం అదనం. అంటే అదొక రూ.106. ఈ రెండు కలిపి గ్రాము కాసుకు రూ.5,656 తీసుకోవాలి. అయితే షాపుల్లో మాత్రం గ్రాము కాసుకు రూ.6,257 వసూలు చేస్తున్నారు. అంటే గ్రాము దగ్గర రూ.600 అధికంగా తీసుకుంటున్నారు. వేయి రూపాయల కొనుగోలుపై రూ.100 ఎక్కువ తీసుకుంటున్నారు. కాసు తయారీకి తరుగు ఏమీ ఉండదు. కేవలం మజూరీ మాత్రమే ఉంటుంది. కానీ ఇతర ఆభరణాల్లా దీనికి కూడా తరుగు తీస్తున్నారు. ఒక్కో బంగారం దుకాణంలో గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 500 కాసులు అమ్ముడుపోతున్నాయి. నగరంలో పేరొందిన దుకాణాల్లో అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంది. వీటిని కొని బిల్లు చెల్లించడానికి క్యూలో నిల్చొంటున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తూనికలు, కొలతల శాఖాధికారులు కనీసం ఇటువంటి సమయంలోనైనా ప్రజలకు మేలు చేసేలా కాసు బంగారానికి ఎంత మొత్తం చెల్లించవచ్చునో అవగాహన కల్పించడం, లేదంటే షాపుల్లో ఎక్కువ మొత్తం తీసుకోకుండా తగిన ప్రచారం చేయాల్సి ఉంది. అలాగే మిగిలిన బంగారు ఆభరణాలకు సైతం తరుగు కనీసం 18 శాతంతో ప్రారంభించి 35 శాతం వరకు తీసుకుంటున్నారు. అంటే పది గ్రాముల ఆభరణం తీసుకుంటే...దానిపై 18 శాతం తరుగు అంటే..మరో రెండు గ్రాముల సొమ్ము అదనంగా చెల్లించాలి. గ్రాము ధర రూ.5,450 కాగా రెండు గ్రాములకు రూ.11 వేలు వరకు ఇవ్వాలి. దీనికి రకరకాల పేర్లు పెట్టి తీసుకుంటున్నారు.
డజను అరటి పండ్లు రూ.100
శ్రావణ మాసమని ఇతర పూజ సామగ్రి ధరలు కూడా పెంచేశారు. డజను రూ.60 ఉండే అరటి పండ్లు గురువారంరూ.100 చొప్పున, కొన్నిచోట్ల రూ.150కు కూడా విక్రయించారు. యాపిల్ పండ్లు వందకు మూడు మాత్రమే ఇచ్చారు. దానిమ్మ జత రూ.100 చొప్పున విక్రయించారు. పూల గురించి చెప్పనక్కర్లేదు. చామంతులు 100 గ్రాములు రూ.60 నుంచి రూ.80కి విక్రయించారు.