వీఎంఆర్‌డీఏలో రికార్డులు తారుమారు

ABN , First Publish Date - 2023-07-29T01:06:58+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో దిగువ స్థాయి సిబ్బంది ఏకంగా రికార్డులనే తారుమారు చేసేస్తున్నారు.

వీఎంఆర్‌డీఏలో రికార్డులు తారుమారు

అదనపు సర్వీసు కోసం అడ్డగోలుగా పుట్టిన తేదీల మార్పు

రిటైర్‌ కావలసినవారు...ఇంకా విధుల్లో సంస్థలో చక్రం తిప్పుతున్న ఇద్దరు ఉద్యోగులు

ఏమీ పట్టించుకోని ఉన్నతాధికారులు

ఆఫీసుల్లో పనిచేయాల్సిన అటెండర్లు...ఉద్యోగుల ఇళ్లలో పనులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో దిగువ స్థాయి సిబ్బంది ఏకంగా రికార్డులనే తారుమారు చేసేస్తున్నారు. మొన్నటివరకు సిబ్బంది సర్వీసు వ్యవహారాలు చూసిన ఇద్దరు ఉద్యోగులు కూడబలుక్కొని కొందరికి మేలు చేసే విధంగా వారి సర్వీస్‌ రికార్డుల్లో పుట్టిన తేదీలను మార్చేశారు. దాంతో 60 ఏళ్లకే రిటైర్‌ కావలసిన వారు ఇంకా కొనసాగుతున్నారు.

గత ఏడాదిలో ఉద్యోగుల సీనియారిటీని లెక్కించే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఉద్యోగి పుట్టిన తేదీ, సర్వీసులో చేరిన కాలం, విద్యార్హతలు, పదోన్నతులు తదితర వివరాలతో రికార్డులు తయారుచేశారు. ఇవన్నీ 2022 సెప్టెంబరులో ఖరారు చేశారు. ఆ సమయంలోనే సంస్థలో పనిచేస్తున్న 36 మంది అటెండర్ల వివరాలను కూడా తీసుకున్నారు. వారిలో ఇద్దరి పుట్టిన తేదీలను మార్చేశారు. గతంలో ఒక ఉద్యోగిని వయస్సు 10-01-1963గా రికార్డుల్లో ఉంది. దానిని ఆ తరువాత 10-01-1966గా మార్చేశారు. అంటే మూడేళ్లు వయస్సు తగ్గించారు. వీఎంఆర్‌డీఏలో రిటైర్‌మెంట్‌ వయస్సు 60 ఏళ్లు. ఆ ప్రకారం ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైర్‌ కావలసి ఉంది. కానీ ఆమె తప్పుడు తేదీ వల్ల ఇంకా సర్వీసులోనే కొనసాగుతోంది. తేదీ దిద్దుబాటు వల్ల ఆమెకు మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది.

అలాగే మరో ఉద్యోగిని వయస్సు పాత రికార్డుల ప్రకారం 19-10-1962 కాగా ఆమె వయస్సును గత ఏడాది సెప్టెంబరులో 28-05-1964గా మార్చేశారు. దాంతో ఆమె కూడా ఇంకా సర్వీసులోనే ఉంది. వీరికి ఒక్కొక్కరికి జీతం రూ.50 వేల పైనే వస్తుంది. కేవలం టీలు, కాఫీలు అందించడమే వీరి పని. దీని కోసం వీఎంఆర్‌డీఏ అంతంత జీతాలు చెల్లిస్తోంది.

ఎందుకు చేశారు..ఎవరు చేశారు..?

వీఎంఆర్‌డీఏలో విభాగాధిపతులు ఎవరి పనులు వారు చూసుకుంటుండగా సంస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తున్నదంటూ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు చూసే ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగంలో కీలక ఉద్యోగి (ఇటీవల బాధ్యతలు తప్పించారు), ప్లానింగ్‌ విభాగంలో తాను చెప్పిందే జరగాలనే ఓ ఉద్యోగి కలిసి ఈ వ్యవహారం నడిపించారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు అటెండర్లు..ఈ ఇద్దరి ఉద్యోగుల ఇళ్లలో పనులు చేస్తూ...ఆఫీసుకు క్యారియర్లు తీసుకువస్తుంటారని, ఆ పనులు చేస్తున్నందుకు కృతజ్ఞతగా వారి సర్వీసు పెరిగేటట్టు రికార్డుల్లో పుట్టిన తేదీలు మార్చేశారని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే ఇంకా ఎంతమంది రికార్డులు ఇలా మార్చేశారో బయట పడుతుంది. ఇప్పుడైనా ఈ తప్పులు చేసిన వారిపై చర్యలు చేపడతారా? లేదంటే...లైంగిక వేధింపుల విచారణలా నీరుగార్చేస్తారా? అనేది చూడాలి. రికార్డుల తారుమారు అంటే చిన్నవిషయం కాదు. క్రిమినల్‌ కేసులు కూడా పెట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2023-07-29T01:06:58+05:30 IST