COVID: భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ రావొచ్చు!

ABN , First Publish Date - 2023-01-07T04:07:41+05:30 IST

భారత్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌కు అవకాశం ఉందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు.

COVID: భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ రావొచ్చు!

వృద్ధులు, వ్యాధిగ్రస్తులు బూస్టర్‌ డోసు తీసుకోవాలి

డబ్లూహెచ్‌వో మాజీ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌కు అవకాశం ఉందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన 16వ గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో స్వామినాథన్‌ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా సహా అనేక దేశాల్లో ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, భారత్‌లో కూడా నాలుగో వేవ్‌ వచ్చేందుకు అవకాశముందని అన్నారు. ప్రస్తుతమున్న వేరియంట్లే కాకుండా మరికొన్ని రావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా బూస్టర్‌ డోసు తీసుకోవాలని ఆమె సూచించారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దని, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించాలన్నారు. అంతకుముందు ఈ సమ్మిట్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..

శాస్త్రీయ పరిశోధన ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు, వైద్యుల నైపుణ్యాభివృద్ధికి ఈ హెల్త్‌ సమ్మిట్‌ ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు-నేడు పథకంలో భాగంగా వైద్య రంగానికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశామన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి సందేశాన్ని సభలో మంత్రి రజిని చదివి వినిపించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ వల్ల లక్షలాది మంది చనిపోయారని, ఆ తరహా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన ప్రయోగాలు త్వరితగతిన చేయాలని సూచించారు. ఏఏపీఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రవి కొల్లి మాట్లాడుతూ వైద్య రంగంలో వచ్చిన అధునాతన సాంకేతికతను, అమెరికాతోపాటు భారత్‌లో అనుసరిస్తున్న విధానాలను పరస్పరం బదిలీ చేసుకునేందుకు ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌ సావనీర్‌ను మంత్రులు విడుదల చేశారు.

గర్భిణుల్లో మానసిక సమస్యలు: డాక్టర్‌ సంపత్‌ ఎస్‌ శివంగి

గర్భం దాల్చిన తర్వాత పలువురు మహిళలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని అమెరికాలోని మిసిసిపి స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ చైర్మన్‌, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సంపత్‌ ఎస్‌ శివంగి వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఆయన 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏఏపీఐ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌లో ఐదేళ్ల కిందట వరకు ప్రతి పది వేల మంది గర్భిణుల్లో 148 మంది మానసిక సమస్యలతో మృతి చెందేవారన్నారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పంపిణీ, మెరుగైన వైద్య సదుపాయాల కల్పన వంటి చర్యల వల్ల మానసిక సమస్యలతో మృత్యువాతపడుతున్న మాతృమూర్తుల సంఖ్య 98కు తగ్గిందన్నారు.

Updated Date - 2023-01-07T07:58:41+05:30 IST