Share News

పట్టణంలో ట్రాఫిక్‌ కష్టాలు

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:14 AM

పట్టణంలో వాహనచోదకులు వన్‌ వే నిబంధనలు పాటించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల వాహన దారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు.

పట్టణంలో ట్రాఫిక్‌ కష్టాలు
ఎలమంచిలి దిమిలి రోడ్డు జంక్షన్‌లో వన్‌వే నిబంధనలు పాటించకుండా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు (ఫైల్‌)

వన్‌ వే నిబంధనలు పాటించని వాహనచోదకులు

ఇష్టానుసారంగా రాకపోకలు

తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్‌

పట్టించుకోని పోలీసులు

ఎలమంచిలి, డిసెంబరు 28: పట్టణంలో వాహనచోదకులు వన్‌ వే నిబంధనలు పాటించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల వాహన దారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎలమంచిలి అభివృద్ధి చెందుతుండడంతో పాటు పట్టణ జనాభాకు తోడు వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్య జటిలంగా మారింది. గతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను దిమిలి రోడ్డు జంక్షన్‌, సైతారుపేట రోడ్డు జంక్షన్లలో వన్‌ వే నిబంధనలు అమలు చేశారు. కొంత కాలం క్రితం ఎలమంచిలి నుంచి దిమిలి రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లేందుకు, సైతారుపేట రోడ్డు మీదుగా ఎలమంచిలిలోకి వాహనాలు వచ్చేందుకు వన్‌ వే నిబంధనలు అమల్లోకి తీసుకు వచ్చారు. ఈ విధంగా వన్‌ వే నిబంధనలు కొంతకాలం పాటు పాటించారు. కాలక్రమేణా పోలీసులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు కూడా నిబంధనలను తుంగలోకి తొక్కారు. దీంతో ఈ రెండు జంక్షన్ల వద్ద వన్‌ వే నిబంధనలు అమలు కావడం లేదు. దిమిలి రోడ్డు జంక్షన్‌ వద్ద కూరగాయల మార్కెట్‌, చేపల బజారు, చికెన్‌ దుకాణ సముదాయాలు ఉండడంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. అసలే ఇరుకుగా ఉన్న ఈ రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. చేపలు, చికెన్‌, మాంసం దుకాణాలు ఈ మార్గంలో ఉండడంతో ఆదివారం రద్దీగా ఉంటుంది. గురువారం వారపు సంత వల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే పాదచారులు, వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు వాహనదారులు ఈ రోడ్డు పక్కనే ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేయడం, కొందరు డ్రైవర్లు ఆటోలను రోడ్డుపై నిలిపి వేయడంతో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి వన్‌ వే నిబంధన పక్కాగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 01:14 AM