ఆరని ఆగ్రహ జ్వాల
ABN , First Publish Date - 2023-03-28T01:10:03+05:30 IST
వెనుకబడిన తరగతులకు చెందిన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను గిరిజనుల జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం సైతం జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, గిరిజన సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టి, తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. పాడేరులో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చిత్రంతో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆందోళనకారులు చించేశారు.
ఎస్‌టీల్లో ఇతర కులాలను చేర్చాలన్న తీర్మానంపై తీవ్ర వ్యతిరేకత
ఏజెన్సీ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు
పెదబయలులో సీఎం దిష్టిబొమ్మతో సహా ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాల దహనం
అసెంబ్లీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
31న మన్యం బంద్‌కు ఆదివాసీలు సన్నద్ధం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
వెనుకబడిన తరగతులకు చెందిన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను గిరిజనుల జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం సైతం జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, గిరిజన సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టి, తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. పాడేరులో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చిత్రంతో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆందోళనకారులు చించేశారు.
ఇతరులను ఎస్‌టీ జాబితాలో చేర్పేంచే యత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 31న గిరిజన ప్రాంతాల బంద్‌ను విజయవంతం చేసేందుకు అఖిల పక్షం నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బంద్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజా సంఘాలు గ్రామాల్లో ప్రచారాలు చేపడుతుండగా... బంద్ పాటిస్తామనే విషయాన్ని, అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, జిల్లా ఎస్‌పీ సతీశ్‌కుమార్‌లకు అఖిలపక్ష నేతలు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. బంద్, ఇతర నిరసనలు శాంతియుతంగా చేయాలని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని వారికి ఎస్‌పీ సతీశ్‌కుమార్ సూచించారు. ఏజెన్సీ వ్యాప్తంగా వివిధ మండలాల్లో అఖిల పక్షాల నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు రామారావుదొర, ముఖి శేషాద్రి, సింహాచలం, ఎం.ప్రసాదరావు, వంపూరు గంగులయ్య, బొర్రా నాగరాజు, కురసా ఉమామహేశ్వరరావు, లకే భాస్కర్, కూడా కృష్ణారావు, బి.సుమన్, ఎస్.గంగరాజు, ఏ.ఆనంద్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలులో అర్ధనగ్న ప్రదర్శన
పెదబయలు మండల కేంద్రంలో వారపు సంత కావడంతో అఖిల పక్ష నేతలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శనతో విల్లంబులు చేతపట్టి నిరసన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను, అరకులోయ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేల చిత్రపటాలను దహనం చేశారు. అనంతరం మెయిన్‌రోడ్డులో ఆందోళనకారులు మానవహారంగా ఏర్పడి తమ నిరసనను తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని బేషరుతుగా ఉపసంహరించుకోవాలని గిరిజన నేతలు డిమాండ్ చేస్తున్నారు.