Share News

అతీగతి లేని అదానీ డేటా సెంటర్‌

ABN , First Publish Date - 2023-11-18T01:24:40+05:30 IST

ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ అంటూ ఊదరగొట్టారు. రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 70 వేల మందికి ఉద్యోగాలు అని ఆర్భాటంగా ప్రకటించారు.

అతీగతి లేని అదానీ డేటా సెంటర్‌

2020లోనే భూమి కేటాయింపు

ఆర్నెల్ల క్రితం సీఎం శంకుస్థాపన

ఇప్పటికీ ప్రారంభం కాని పనులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ అంటూ ఊదరగొట్టారు. రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 70 వేల మందికి ఉద్యోగాలు అని ఆర్భాటంగా ప్రకటించారు. భూమి కేటాయించి మూడేళ్లైంది. శంకుస్థాపన చేసి ఆరు నెలలు దాటింది. కొండపైకి రహదారి కూడా నిర్మించారు. అయితే, ఇప్పటికీ అక్కడ పునాదిరాయి తప్ప ఇంకేమీ లేదు. అక్కడికిఎవరూ వెళ్లకుండా బండరాళ్లు అడ్డం పెట్టారు. దీన్నిబట్టి ఇప్పట్లో అక్కడ పనులు ప్రారంభించే యోచన లేదని అర్థమవుతోంది. ఇదీ విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌ పరిస్థితి.

పాత ఒప్పందం రద్దు చేసి.. కొత్త ఒప్పందం..

అదానీ డేటా సెంటర్‌ నిర్మాణానికి తెలుగుదేశం హయాంలోనే శంకుస్థాపన జరిగింది. వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసి, కొత్త ఒప్పందం చేసుకుంది. తొలుత 2020లో మధురవాడలో సర్వే నంబరు 409/పి నుంచి 427 వరకు విస్తరించి ఉన్న నాలుగో నంబరు కొండపై 130 ఎకరాలు కేటాయించింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేసింది. అదానీ పేచీ పెట్టడంతో లీజు ఒప్పందాన్ని రద్దు చేసి ఏకంగా సేల్‌ డీడ్‌ రాసేసింది. ‘వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌’ అని స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుచేస్తే దానికీ అంగీకరించారు. భూమి కేటాయించిన నాటి నుంచి మూడేళ్లలో పనులు ప్రారంభించాలనే నిబంధన పెట్టారు. దాన్ని ఉల్లంఘించినా చర్యల్లేవు. ఆ తరువాత 2022లో అదే కొండపై మరో 9 ఎకరాలు, 2023 ఫిబ్రవరిలో ఇంకో 61 ఎకరాలు కేటాయించింది. అంటే సుమారు 200 ఎకరాలు. ఆ కొండపై ఇంకో 70 ఎకరాలు ఉంది. అది కూడా వారికేనని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. 270 ఎకరాల కొండ స్వాధీనంలో పెట్టుకున్న అదానీ కంపెనీ తీరుబడిగా ఈ ఏడాది మే 3న సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించింది. ఇక్కడ 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు డేటా సెంటర్లు, ఐటీ బిజినెస్‌ పార్క్‌, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ క్లబ్‌ వంటివి వస్తాయని సీఎం ప్రకటించారు. ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ను ఇక్కడ నిర్మిస్తామని అదానీ ఎండీ రాజేశ్‌ అదానీ చెప్పారు. ఆరు నెలలు దాటింది. పనులు ప్రారంభించలేదు

అదానీకి ఎన్నో మేళ్లు..

అక్కడ ఎకరా భూమి విలువ రూ.20 కోట్లు ఉండగా, కోటి రూపాయల చొప్పునే ఇచ్చేశారు.

రిజిస్ట్రేషన్‌ చార్జీలు మినహాయింపు

శంకుస్థాపనకుముందే ఐలా హోదా ఇచ్చి, జీవీఎంసీకి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు.

ఆ భూమిలో గుంతలు ఉన్నాయంటే మరో తొమ్మిదెకరాలు ఇచ్చారు.

Updated Date - 2023-11-18T01:24:41+05:30 IST