నది గర్భం కలుషితం
ABN , First Publish Date - 2023-02-07T00:56:59+05:30 IST
మునిసిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే వరహానది కలుషితం అవుతోంది.

నర్సీపట్నం, ఫిబ్రవరి 6 : మునిసిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే వరహానది కలుషితం అవుతోంది. నదిని ఆనుకొని చెత్తను డంపింగ్ చేయడంతో వర్థాలు చేరి నీరు కలుషితం అవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016వ సంవత్సరాంలో వరహానదికి ఆనుకొని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలోని అన్ని వార్డులు, మార్కెట్, మెయిన్ రోడ్డులోని చెత్తను ఇక్కడకు తరలించి తడి, పొడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజులు, టైర్లు ఇతర వ్యర్థాలను వేరు చేసి రీ సైక్లింగ్‌కి తరలించాలి. వరహానది ఒడ్డున కంపోస్ట్ యార్డు పెట్టవద్దని అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డంపింగ్ యార్డుకు స్థలం లేదని చెప్పి మునిసిపల్ అధికారులు వరహానదిని ఆనుకొని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కుని ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలోని 28 వార్డులు, మార్కెట్లు, మెయిన్ రోడ్డు నుంచి రోజుకి 30 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను మొత్తాన్ని ఇక్కడకు తరలించి వరహానది ఒడ్డున డంపింగ్ చేస్తున్నారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. దీని వలన నీరు, భూమి కలుషితం అవుతోంది. వర్షాలు పడితే వరహానది నీటి ప్రవాహం పెరిగితే చెత్తా చెదారం కొట్టుకు వస్తుంది. చెత్త తడిచి మురుగునీఉ వరహానదిలోకి ధారలు కడుతుంది. చెత్త పేరుకు పోయిన తర్వాత డంపింగ్ చేసిన దగ్గరే తగలబెడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ప్రకారం చెత్తను తగల బెట్టకూడదు. ఆ బూడిద మొత్తం వరహానదిలోకి వస్తుంది. చెత్తా చెదారంతో కలుషితమై ఈ నీటినే మునిసిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలు కోసం దుగ్గాడ వాటర్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. దుగ్గాడ పథకం నుంచి వరహానది నీరు బలిఘట్టం పాత పంచాయతీ కార్యాలయం పక్కన సంపులకు తరలించి అక్కడ క్లోరినేషన్ చేసి పబ్లిక్ కొళాయిలు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగడానికి ఎంత వరకు శ్రేయస్కరమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నీటిని తాగడానికి భయపడి ప్రైవేటు ఆర్‌వో ప్లాంట్‌లు మీద ఆధార పడుతున్నారు. సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ కంపోస్ట్ యార్డుని సందర్శించి వరహానది ఒడ్డున చెత్త డంపింగ్ ఆపేయాలని సూచించారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. ఆయన ఆదేశాలు కార్య రూపం దాల్చలేదు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబుని విరవణ కోరగా.. చెత్త తరలించడానికి వేరే స్థలం లేదన్నారు.