‘గడప’ దాటని పనులు!

ABN , First Publish Date - 2023-03-01T01:18:36+05:30 IST

జిల్లాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నతీరున సాగుతున్నాయి. ‘గడప గడప..’ కార్యక్రమం పూర్తయిన సచివాలయాల పరిధిలో మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే పనులు మంజూరయ్యాయి. వీటిల్లో రూ.20 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.10 కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయగా ఒక్క బిల్లు కూడా విడుదల కాలేదని తెలిసింది. మిగిలిన రూ.20 కోట్ల విలువ చేసే పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించలేదు.

‘గడప’ దాటని పనులు!
పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో నిర్మించిన మురుగు కాలువ. ఈ పనికి సంబంధించి బిల్లు విడుదల కాలేదు.

నిధులు విడుదలకాక ముందుకు సాగని నిర్మాణాలు

జిల్లాలో 220 సచివాలయాల పరిధిలో ‘గడప గడపకు...’ పూర్తి

సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల చొప్పున నిధులు

జిల్లాలో రూ.40 కోట్ల విలువ చేసే పనులకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

టెండర్లు పిలిచిన అధికారులు

రూ.20 కోట్ల పనులకు మాత్రమే టెండర్లు ఖరారు

ఆరంభంలో చురుగ్గా పనులు సాగించిన కాంట్రాక్టర్లు

దశలవారీగా ఇంతవరకు రూ.10 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌

ఒక్క బిల్లుకు కూడా విడుదలకాని నిధులు

మిగిలిన పనులను ఆపేసిన కాంట్రాక్టర్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నతీరున సాగుతున్నాయి. ‘గడప గడప..’ కార్యక్రమం పూర్తయిన సచివాలయాల పరిధిలో మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే పనులు మంజూరయ్యాయి. వీటిల్లో రూ.20 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.10 కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయగా ఒక్క బిల్లు కూడా విడుదల కాలేదని తెలిసింది. మిగిలిన రూ.20 కోట్ల విలువ చేసే పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించలేదు.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సుమారు ఆరు నెలల క్రితం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాలు/ పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. అర్జీలను స్వీకరించాలి. సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ఇందు కోసం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు అవుతాయి’ అని పాలకులు ప్రకటించారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు షెడ్యూల్‌ రూపొందించుకుని పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో వుండడంతో తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ విషయం అటుంచితే... ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్టు గతంలోనే ప్రకటించింది. ఈ నిధులతో డ్రైనేజీ కాలువలు, సిమెంట్‌ రహదారులు, తాగునీటి వసతుల కల్పన, సామాజిక భవనాల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని నిర్దేశించింది.

ఇదిలావుండగా ‘గడప గడపకు’ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే వి.మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో 80 శాతం పంచాయతీల్లో ఈ కార్యక్రమం పూర్తయ్యింది. అనకాపల్లి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో సగం సచివాలయాల పరిధిలో మాత్రమే జరిగింది. మొత్తం మీద జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేనాటికి 220 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంతకన్నా చాలా రోజుల ముందే సుమారు 200 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో గుర్తించిన పనులకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.40 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. స్థానిక అధికారులు రూ.5 లక్షలకు మించి విలువైన పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.5 లక్షలకన్నా తక్కువ విలువైన పనులను అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులే నామినేషన్‌ విధానంలో చేపట్టినట్టు తెలిసింది. మొత్తం మీద రూ.20 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభం అయ్యాయి. వీటిల్లో చాలా పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సుమారు రూ.10 కోట్ల మేర బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇంతవరకు ఒక్క బిల్లు కూడా క్లియర్‌ కాలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. దీంతో మిగిలిన పనుల్లో కొన్నింటిని ఆపేశారు. కొత్త పనులను ప్రారంభించలేదు.

-----

ఎలమంచిలి మండలంలో 10 సచివాలయాలు ఉండగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, అధికారులు కలిసి గత ఏడాది అక్టోబరులోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి పూర్తిచేశారు. ఈ సచివాలయాల పరిధిలో రూ.2 కోట్ల విలువైన వివిధ రకాల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఏటికొప్పాక పంట కాలువ పనులకు రూ.6 లక్షలు మంజూరు చేశారు. పంచాతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు మరో రూ.12 లక్షల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఎమ్మెల్యే శంకుస్థాపన కూడా చేవారు. అంతకుముందు పూర్తిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు నెమ్మదించాయి.

నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలో 20 సచివాలయాల పరిధిలో 79 అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. పూర్తయిన పనులకు బిల్లు చెల్లింపులు జరగలేదు.

చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 85 సచివాలయాలు ఉండగా.. గడప గడపకు కార్యక్రమం 49 సచివాలయాల పరిధిలో పూర్తయ్యింది. వీటిల్లో సమారు రూ.10 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపారు. రోలుగుంట మండలంలో 51 పనులకు రూ.1.40 కోట్లు మంజూరవ్వగా 38 పనులు మాత్రమే ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.

పాయకరావుపేట మండలంలో గోపాలపట్నం సచివాలయం పరిధిలో రూ.6 లక్షలతో కల్వర్టు పనులు పూర్తిచేశారు. ఎం.బుక్‌లో నమోదు చేసి, బిల్లులు అప్‌లోడ్‌ చేసినా ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో మిగిలిన పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-01T01:18:36+05:30 IST