వ్యానులో 14 ఆవులు, ఎద్దులను కుక్కేసి..

ABN , First Publish Date - 2023-07-27T23:55:54+05:30 IST

నాలుగైదు పశువులు మాత్రమే పట్టే స్థలం ఉన్న వ్యాను అది. అలాంటిది ఏకంగా 14 ఆవులు, ఎద్దులను కర్కశంగా కుక్కేసి తరలించేస్తున్నారు.

వ్యానులో 14 ఆవులు, ఎద్దులను కుక్కేసి..

బొబ్బిలి: నాలుగైదు పశువులు మాత్రమే పట్టే స్థలం ఉన్న వ్యాను అది. అలాంటిది ఏకంగా 14 ఆవులు, ఎద్దులను కర్కశంగా కుక్కేసి తరలించేస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో వ్యాను ఢీకొన్న వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం చోటు చేసుకుంది. పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లా మానాపురం సంతకు ఓ వ్యానులో 14 ఆవులు, గేదెలను తరలిస్తున్నారు. వీటిని లోపల కుక్కేసి బటయకు అవి కనపడకుండా చేసేశారు. వ్యాన్‌ బొబ్బిలి పట్టణంలో ఆర్టీసీకాంప్లెక్స్‌ సమీపా న పెట్రోల్‌బంకు ముందు పాతిరెడ్డి సురేష్‌ (35) అనే వ్యక్తిని ఢీకొనడంతో ఆయ న అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాను లోపల పరిశీలిస్తే 14 మూగ జీవాలు అత్యంత దయనీయస్థితిలో కనిపించాయి. ఈ దృశ్యం చూసిన పోలీసులు, స్థానికులు చలించిపోయారు. పశువులను ఇంత దారుణంగా రవాణా చేయడం దుర్మార్గమని స్థానికులు మండిపడ్డారు. మెంటాడ మండలం పెదచామాలాపల్లి గ్రామానికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ నీలిరోతు ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతుహింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటిని తరలిస్తున్న యజమాని కోసం ఆరా తీస్తున్నారు.

చెన్నై నుంచి భార్య, పిల్లలను చూసేందుకు వచ్చి..

పాతిరెడ్డి సురేష్‌ గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో కూలీ పనిచేసుకుని జీవనం సాగిస్తున్నాడు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని అప్పయ్యపేట గ్రామంలో అత్తవారింటి వద్ద ఉన్న భార్యా పిల్లలను చూసేందుకు గురువారం బొబ్బిలి వచ్చాడు. పెట్రోల్‌ బంకు ముందు వేగంగా వస్తున్న వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - 2023-07-27T23:55:54+05:30 IST