మహిళా మార్టులేవీ?

ABN , First Publish Date - 2023-02-03T00:07:42+05:30 IST

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తాం.. వారిలో ఆర్థిక సాధికారతను తీసుకొస్తాం అంటూ ప్రభుత్వం ప్రకటించి నెలలవుతోంది. నేటికీ కార్యాచరణ అయితే లేదు. ఈ పేరుతో ప్రతి పొదుపు సంఘం నుంచి రూ.1500 మాత్రం వసూలు చేశారు.

మహిళా మార్టులేవీ?

జిల్లాలో ఎక్కడా ప్రారంభం కాని వైనం

ప్రతీ పొదుపు సంఘం నుంచి రూ.1500 వసూలు

బొబ్బిలి, ఫిబ్రవరి 2: మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తాం.. వారిలో ఆర్థిక సాధికారతను తీసుకొస్తాం అంటూ ప్రభుత్వం ప్రకటించి నెలలవుతోంది. నేటికీ కార్యాచరణ అయితే లేదు. ఈ పేరుతో ప్రతి పొదుపు సంఘం నుంచి రూ.1500 మాత్రం వసూలు చేశారు.

మున్సిపాలిటీల్లో మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం ప్రతిపాదించారు. పట్టణ సమాఖ్యల ద్వారా తీర్మానం చేశాక విధివిధానాలను అమలు చేస్తామన్నారు. కొందరు ప్రభుత్వాధినేతలు గతంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా బజార్లు బాగాలేవని చెబుతూ కార్పొరేట్‌ తరహా వ్యాపారాలను మహిళలతో చేయిస్తామని ప్రకటించారు. పట్టణ సమాఖ్యల్లో సభ్యత్వం కలిగిన ప్రతీ ఎస్‌ఎల్‌ఎఫ్‌ (స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్‌)ను జేఎంఎంలో వాటాదారునిగా పరిగణిస్తామన్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి రూ.1500ల వాటాధనం కూడా సేకరించారు. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. అసలు మార్టులు ఏర్పాటు చేస్తారా అన్న సందేహాన్ని మహిళలు వ్యక్తం చేస్తున్నారు.

మార్టుల నియమావళి ఇలా

కనీసం ఇంటర్‌ విద్యార్హత, వ్యాపార అనుభవం కలిగిన వారితో 11 మంది సభ్యుల కమిటీ వేస్తారు. మెప్మా కార్యాలయం రూపొందించిన బైలా ప్రకారం అధ్యక్ష, ఉపాఽధ్యక్ష, కార్యదర్శి, కోశాదికారి వంటి పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. పరస్పర సహాయ సహకార సంస్థ చట్టం (మాక్స్‌ యాక్టు) పరిధిలో జేఎంఎంను రిజిస్ర్టేషన్‌ చేయించాలి. అన్నీ ఆన్‌లైన్‌ లావాదేవీలనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మార్టుల పేరుతో విజిటింగ్‌ కార్డులు, లెటర్‌ హెడ్‌లు, యూనిఫామ్‌, గుర్తింపుకార్డులు, వాల్‌పోస్టరు, ప్రచార హోర్డింగ్‌, కరపత్రాలు ఇలా ప్రతీ అంశాన్ని పొందుపరుస్తూ మార్ట్‌ల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలను సిద్ధం చేశారు. కాగా బొబ్బిలి పట్టణంలో మూసివేసిన అన్న క్యాంటీన్‌ భవన్‌లో జగనన్న మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంఘాల అకౌంట్‌ల నుంచి మహిళా మార్టు కోసం రూ.1500 చొప్పున వాటాధనం చెల్లించామని పలువురు మహిళలు తెలిపారు.

కార్యకలాపాలు ప్రారంభిస్తాం

బొబ్బిలి పట్టణంలో 1400 మహిళా సంఘాలున్నాయి. వాటిలో సుమారు 60 శాతం మంది రూ.1500 చొప్పున చెల్లించారు. పూర్తిస్ధాయిలో వాటాధనం చెల్లించిన తరువాత నిబంధనల ప్రకారం కమిటీలు వేసి, రిజిస్ర్టేషన్‌ చేయించి, ప్రభుత్వ అనుమతితో కార్యకలాపాలు ప్రారంభిస్తాం.

- రాము, సిటీ మిషన్‌ మేనేజర్‌, బొబ్బిలి

సన్నాహాలు జరుగుతున్నాయి

పెద్ద పట్టణాల్లో జగనన్న మహిళా మార్టుల ఏర్పాటు కోసం సన్నాహక కార్యకలాపాలు ప్రారంభించాం. ఇందుకోసం మున్సిపాలిటీల సహకారం తీసుకుంటాం. ఖాళీగా ఉన్న అన్న క్యాంటీన్‌ భవనాలు గాని, ఇతర ప్రభుత్వ భవనాలను గాని ఇందుకోసం వినియోగించుకుంటాం. సంఘాల నుంచి పూర్తి స్థాయిలో వాటాధనం వసూలైన తరువాత రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపడతాం. కమిటీలు వేసి వ్యాపారాలను ప్రారంభిస్తాం.

- బి.సుఽధాకరరరావు, జిల్లా మెప్మాప్రాజెక్టు డైరెక్టరు, విజయనగరం

==========

Updated Date - 2023-02-03T00:07:44+05:30 IST