Vijayanagaram Dist.: విజయనగరంలో పండగ శోభ
ABN , First Publish Date - 2023-10-29T09:51:06+05:30 IST
విజయనగరం: నగరంలో పండగ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి విజయనగర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. మహారాజ కోటతో పాటు చారిత్రాత్మక కట్టడాలకు.. ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులు అలంకరించారు.
విజయనగరం: నగరంలో పండగ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి విజయనగర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. మహారాజ కోటతో పాటు చారిత్రాత్మక కట్టడాలకు.. ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులు అలంకరించారు. సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడా ప్రదర్శనలకు, పోటీలకు ఏర్పాట్లు చేశారు.
కాగా పైడితల్లి అమ్మవారి సిరిమాను రథం ఊరేగింపు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభం కావాలని ఆర్డీవో సూర్యకళ స్పష్టంచేశారు. ఈ ఏడాది సమయపాలన పాటించాలని, ముందుగానే అవసరమైన సామగ్రి, నిర్వాహకులను సిద్ధం చేయాలని ఆదేశించారు. సిరిమానోత్సవంపై తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె శనివారం సమీక్షించారు. రథాలన్నీ 11 గంటలకే సిద్ధం కావాలని, దారి పొడువునా భక్తులు పూజలు చేస్తూ మొక్కలు తీర్చుకుంటారని, వారి ఆనవాయితీలను పాటిస్తూ సమయానికి కదిలేలా చూడాలన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి గుడి వద్దకు రథాలు చేరుకోవాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి అనుమతిస్తూనే ట్రాఫిక్‌ను నియంత్రించి సమయానికి చేరుకునేలా చూడాలని చెప్పారు. సిరిమానోత్సవంలో రథాల ముందు అనుమతించిన వ్యక్తులు తప్ప ఇతరులకు చోటు ఉండకూడదని... టీ షర్టులు, ఐడీ కార్డులు వేదికల వారీగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో పైడితల్లి దేవాలయ ఈవో సుధారాణి, పూజారి బంటుపల్లి వెంకటరావు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
పటిష్ట బందోబస్తు: ఎస్పీ
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దీపిక చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశం మందిరంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బందోబస్త్‌ను సెక్టార్లుగా విభజించి.. మూడు షిఫ్టులుగా సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 58 మంది సీఐ, ఆర్‌ఐలు.. 144 మంది ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు... 19 మంది మహిళా ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బందితో 2015 మందిని వినియోగిస్తున్నా మన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆలయం ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిరంతరం సీసీ కెమెరాలు, సిబ్బంది వద్ద బాడ్‌వార్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. అయోధ్య మైదానం, ఎంఆర్ కళాశాల వసతిగృహం, రాజీవ్ స్టేడియం, పెద్ద చెరువు గట్టు, పోర్టు సిటీ స్కూల్ రోడ్డు, దాసన్నపేట రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఉంటుందన్నారు. సిరిమాను తంతును తిలకించేలా అనుసంధాన రహదారుల్లో ప్రత్యేక టీవీలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎఎస్పీ అస్మాపరహీన్, డీఎస్పీలు గోవిందరావు, విశ్వనాధ్, సీఐలు వెంకట్రావు, నరసింహమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు.
పండగకు ప్రత్యేక బస్సులు
పైడితల్లి అమ్మవారి జాతరను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపను న్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. విజయనగరం- శ్రీకా కుళం, మన్యం జిల్లాల నుంచి సుమారు 120 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి అదనపు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్.కోట-జామి- విజయనగరం... ఎస్.కోట-ధర్మవరం-విజయనగరం...ఎస్.కోట-కొత్తవలస- విజయనగరం... విజయనగరం- విశాఖ.. పార్వతీపురం-విజయనగరం.. సాలూరు-విజయనగరం, విశాఖ-పాలకొండ, శ్రీకాకుళం-విజయనగరం రహదారుల్లో ఈ బస్సులు తిరుగుతాయన్నారు. భక్తులు సాధారణ బస్సు చార్జీలతోనే ప్రయాణించవచ్చని వెళ్లడించారు.