ఎడతెరిపిలేని వాన
ABN , First Publish Date - 2023-07-27T00:43:27+05:30 IST
వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. రోజంతా ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగిపొర్లుతున్న వాగులు, గెడ్డలు
నీటమునిగిన తంపర భూములు
(పాలకొండ)
వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. రోజంతా ఎడతెరిపిలేకుండా కురిసిన వానకు ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేక పోయారు. మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలకు అత్యధికారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా పలుచోట్ల పంట పొలాల్లోనూ నీరు చేరింది. అల్పపీడనం కారణంగా ఇప్పటికే జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వాయుగుండం వల్ల వివిధ ప్రాంతాల్లో ఏకధాటిగా, కొన్నిచోట్ల ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో కొండవాగులు, గెడ్డలు, ఇతర సాగునీటి వనరులకు వరదనీరు పోటెత్తింది. తంపర భూములు నీటమునిగాయి. వాస్తవంగా జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న తంపర భూముల్లో ఇప్పటికే ఎద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. అయితే ఆ పంట అంతా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురైంది. కాగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎద పంట కుళ్లిపోయే ప్రమాదమని రైతులు చెబుతున్నారు. నాట్లు వేసిన పొలంలోనూ నీరు నిల్వ ఉంటే పంటపై ప్రభావం చూపే అవకాశం ఉందని మరికొందరు వాపోతున్నారు.
పలుచోట్ల ఇలా..
- పాలకొండ మండలంలోని ఓనిగెడ్డ, రావాడగెడ్డ, జంపరకోట గెడ్డ, గజిలిగెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ గెడ్డలన్నీ నాగావళిలో ఒకేచోట కలవాల్సి ఉంది. అయితే నదికి కూడా వరద పోటెత్తుతుండడంతో గెడ్డల నుంచి వచ్చిన వరదనీరు పంట పొలాల్లోకి చేరుతుంది. దీంతో పాలకొండ మండలంలోని తంపటాపల్లి, వీపీరాజుపేట, బుక్కూరు, పాలకొండ, గోపాలపురం, మంగళాపురం తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల వరకు వరి పంట నీటమునిగింది.
- పాలకొండ మండలంలోని జంపరకోట జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వాస్తవంగా 1986లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రైతులకు అందుబాటులోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు మట్టికట్ట పనులే చేపట్టగా రెండేళ్ల కిందట కురిసిన వర్షాలక అవి కూడా కొట్టుకుపోయాయి. మొత్తంగా రూ.25 లక్షలతో ప్రారంభమైన ప్రాజెక్టు అంచనా ప్రస్తుతం రూ.25 కోట్లకు చేరింది.
- పాలకొండ పట్టణంలో కురిసిన వర్షానికి ఆర్టీసీ కాంప్లెక్స్, గారమ్మకాలనీ, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ కార్యాలయం తదితర కార్యాలయాల ప్రాంగణాలు నీటమునిగాయి. ప్రధాన రహదారిలో నీరు నిలిచింది.
- జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాచిపెంట, సాలూరు, మక్కువ తదితర ప్రాంతాల్లోనూ కొండవాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలతో పాటు తంపర భూములు నీటమునిగాయి.
- పాలకొండ మండలం బాసూరు వద్ద తోటపల్లి ఎడమ బ్రాంచ్ కాలువకు గండి పడింది. దీంతో ఆ ప్రాంతంలోని 500 ఎకరాలు ముంపునకు గురయ్యాయి.
వర్షపాతం నమోదు ఇలా..
పాలకొండ: జిల్లావ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షపాతం ఇలా నమోదైంది. పార్వతీపురంలో 5.2 మిల్లీమీటర్లు, కొమరాడ 7.6, గరుగుబిల్లి 23.0, సీతానగరం 7.2, మక్కవ 0.6, పాచిపెంట 0.8, బలిజిపేట 14.2, సాలూరు 2.8, పాలకొండ 12.2, భామిని 4.2, జి.ఎల్‌పురం 2.4, కురుపాం 4.2, వీరఘట్టం 7.8, సీతంపేట 10.2, జియ్యమ్మవలస 12.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.