Chandrababu: ఎన్ని వేల మంది వస్తారో రండి.. తేల్చుకుందాం
ABN , First Publish Date - 2023-02-25T02:31:58+05:30 IST
మనం చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. ఈ రాష్ర్టాన్ని కాపాడుకునే పోరాటం చేస్తున్నాం.
సైకోను కూడా రమ్మనండి.. నేను చూస్కుంటా!
రాష్ట్రంలో వింత జంతువులతో పోరాడుతున్నాం
బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు మాది
మహానుభావుల జిల్లాలో సైకోలు, రౌడీలా?
ఏమారితే గన్నవరం మరో పులివెందులే
బాధితులపైనే కేసులా? ఇదేమి లా అండ్ ఆర్డర్?
వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే
గూగుల్ టెక్నాలజీతో నిందితుల గుట్టురట్టు
రాబోయేది వైసీపీకి కష్టకాలమే: చంద్రబాబు
గన్నవరంలో పర్యటన.. జోన్ 2 శిక్షణలో ప్రసంగం
విజయవాడ, గన్నవరం, ఏలూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మనం చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. ఈ రాష్ర్టాన్ని కాపాడుకునే పోరాటం చేస్తున్నాం. ఉన్మాదులతో తలపడుతున్నాం. మీలాంటి సైకోలను, రౌడీలను చరిత్రలో చాలామందిని చూశాం’’ అని టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఏలూరు సమీపాన చొదిమెళ్ల శివారులోని జోన్-2 తెలుగుదేశం శిక్షణా శిబిరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆయన గన్నవరంలో ఆగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు. ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని, దహనమైన కార్లను పరిశీలించారు. అనంతరం అక్కడ మీడియాతో, శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. ‘‘టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా. ఈ రాష్ర్టాన్ని కాపాడుకునే విషయంలో అందరం ముందుకు పోదాం. వ్యవస్థకు చెడు పురుగులు ఎవరున్నా సరే తొలగించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. అదే భవిష్యత్తులో జరుగుతుంది’’ అని విస్పష్ట హెచ్చరిక చేశారు.
ప్రణాళికాబద్ధంగా దాడులు...
‘‘ఇది భావోద్వేగంతో జరిగిన ఘటన కాదు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయి. టెర్రరిస్టులు కూడా ఇలా చేయరు. గన్నవరం ప్రాంతంలో వైసీపీ గూండాలు, సైకోలు, రౌడీలు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మొత్తం ఐదు కార్లు, రెండు స్కూటర్లు ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసులో అద్దాలు పగలగొట్టి, ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు. మహనీయులు పుట్టిన జిల్లా. ఇలాంటి ప్రదేశంలో రౌడీలు, సైకోలు స్వైర విహారం చేయటం, బెదిరించటం చూస్తే ఎక్కడికిపోతున్నామో అర్థం కావటం లేదు. ఏ రౌడీ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. పోలీసులు వింత చేష్టలు, పనికిమాలిన వేషాలు వేస్తున్నారు. జగన్‌ను నమ్ముకున్న వారంతా జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోతామంటే అది మీ ఖర్మ. ప్రజల ఆస్తులకు అండగా, వారి ప్రాణాలకు రక్షణగా ఉంటాం. వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపైన వైసీపీ రౌడీలు దాడి చేయటం నీచం. రాత్రుళ్లు తీసుకుపోవటానికి మీరు దొంగలా? పోలీసులా? ఆఖరికి అడ్వకేటును కూడా పట్టుకుని ఆయన మీద కూడా కేసు వేశారు’’ అంటూ తప్పుపట్టారు.
గన్నవరమేమైనా పాకిస్థాన్‌లో ఉందా?
‘‘గన్నవరంలో రౌడీలు స్వైరవిహారం చేస్తే మొన్న నేను చూడటానికి ఎయిర్‌పోర్టుకు వస్తే 1,000 మంది పోలీసులను వేసుకొచ్చారు. నేను గన్నవరం పోకూడదట. గన్నవరం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? పార్టీ ఆఫీసు నుంచి అందరూ ఫోన్లు చేసినా పోలీసులు మీనమేషాలు లెక్కించారు. మొత్తం దహనం జరిగాక.. తీరిగ్గా వచ్చి నాకు పాఠాలు చెబుతారా? చేసిన నిర్వాకానికి సిగ్గుపడాలి. ఫిర్యాదు చేసిన వారిపై సీఐ ఎస్సీ, ఎస్టీ కేసు పెడతాడు. ఆ సీఐ ఎఫ్‌ఐఆర్‌లో క్రిస్టియన్ అని రాశాడు. క్రిస్టియన్ అంటే బీసీ. బీసీ అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదు. దానిని సమర్థిస్తూ ఎస్పీ స్టేట్‌మెంట్ ఇస్తాడు. రేపు నేను వస్తూనే ఒక ఎంక్వయిరీ వేసి మక్కెలు విరగ్గొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఈ అరాచకాలు ఏమిటి? బాధితులు మేమే! దాడులు మామీదనే జరిగాయి. మా ఆఫీసు మీదనే దాడి చేశారు. ధ్వంసమైన కార్లు మావే. చివరికి మమ్మల్నే పట్టుకుపోయారు. శభాష్ పోలీసులూ. మీకు కూడా ఒక మనసు ఉంది. కుటుంబాలు ఉన్నా యి. జాగ్రత్త! మీ ఇంట్లో మీ కొడుకును, భార్యను, కూతురుని అడిగండి... మీరు చేసిన సిగ్గుమాలిన పనిని వారు సమర్థిస్తే.. నేనూ ఆమోదిస్తా. ఇది మంచి పద్ధతి కాదు’’ అంటూ హెచ్చరించారు. ‘ఈ రాష్ట్రంలో అవినీతి సైకో పాలన పోయే వరకు పోరాడతా. ఈ పోరాటం ఆగదు. ప్రజలారా నాకు సహకరించండి. కృష్ణా జిల్లాలోనే ఈ మాదిరిగా ఉందంటే... పులివెందులలో ఏ విధంగా ఉందో ఆలోచించాలి. మీరు ఏమారితే గన్నవరం మరో పులివెందుల అవుతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
జోన్-2 శిక్షణ శిబిరంలో బాబు
శుక్రవారం ఏలూరు సమీపాన చొదిమెళ్ల శివారులో జరిగిన జోన్-2 తెలుగుదేశం శిక్షణా శిబిరంలో చంద్రబాబు పాలు పంచుకున్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లతో ఆయన ముఖాముఖి భేటీ అయ్యారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సుదీర్ఘ శిక్షణలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రస్తావిస్తూనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 5 పార్లమెంటు స్థానాలు, 36 అసెంబ్లీ స్థానాలను మనమే గెలవాలన్నారు. ఇది రైతుల విజయం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ‘‘కార్యకర్తలనుకుంటే పార్టీ తేలిగ్గా గెలుస్తుంది. హూ కిల్డ్ బాబాయ్ అని అడిగితే గూగుల్ చెప్పేస్తుంది. ఎవరు చంపేశారో గూగుల్ టేక్ అవుట్‌తో బండారం బద్ధలయింది. టెక్నాలజీదే ఎప్పుడూ విజయం. జగన్‌రెడ్డికి ఇది అర్థం కాదు. గుమస్తా సజ్జల ఏది వస్తే అది వాగేస్తారు. నేనేమో ఏదో మేనేజ్ చేశానని వాగుతున్నాడు. వివేకా హత్య ముమ్మాటికీ అంతఃపుర హత్యే. రాబోయే ఎన్నికల్లో రావణాసురిడితో పోరాటం చేయబోతున్నాం. నూటికి వెయ్యి శాతం మనమే గెలువబోతున్నాం. వైసీపీ వాళ్లకు హనీమూన్ అయిపోయింది. రాబోయేది వారికి కష్టకాలమే. పోలీసుల కేసులకు కేడర్ భయపడనక్కర్లేదు. అవసరమైతే 200 మంది అడ్వకేట్లను నియమిస్తా’’ అని భరోసా ఇచ్చారు. ‘‘పోలవరం రాష్ట్రానికి ఒక వరం. మనమే అధికారంలో ఉంటే 2020 జూన్ నాటికే పూర్తయ్యి ఉండేది. రివర్స్ మేన్ వచ్చాడు అంతా రివర్స్ అయ్యింది. ఒకరి మూర్ఖత్వంతో పోలవరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తమంతా నాశనమైంది’’ అంటూ జగన్ తీరుపై మండిపడ్డారు.
టీడీపీలో విభేదాల పరిష్కారానికి ఫార్ములా
‘‘నేను ఎక్కడికక్కడ నివేదికలు రప్పిస్తున్నాను. సర్వేలు చేయిస్తున్నాను. సామర్థ్యం లేని వారిని, పనిచేయని వారిని పక్కన పెట్టేందుకు సిద్ధం. అందుకు అంగీకరిస్తారా?’’ అంటూ ఇన్‌చార్జ్‌లను చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు సంఘీభావంగా అందరూ చేతులు పైకెత్తారు. పార్టీలో ఆధిపత్య పోరు, విభేదాలు మంచివి కావని హితవు పలికారు. అటువంటి వాటిని సహించనని స్పష్టంచేశారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో నా దగ్గర లిస్టు ఉంది. విభేదాలు కేన్సర్‌లాంటివి. నిర్లక్ష్యం చేస్తే కేన్సర్ శరీరమంతా పాకుతుంది. అందుకే విభేదాలు విడనాడండి, పార్టీ కోసం పనిచేయండి. విభేదాల నివారణ కోసం నా దగ్గర వ్యవస్థ సిద్ధంగా ఉంది’’ అని చంద్రబాబు ప్రకటించారు.
‘‘కావాలంటే లగ్నం పెడదాం. మీరు ఎన్ని వేల మంది వస్తారో రండి. మేము కూడా వస్తాం. దొంగ దెబ్బతీయవద్దు. దొంగ ఆటలాడవద్దు. పోలీసులను వదిలిపెట్టి రండి. ఎవ్వడికైనా ధైర్యం ఉంటే రండి. నీ సైకోను కూడా రమ్మను నేను చూస్కుంటా. మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు మాది. రాష్ట్ర ప్రజల కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ప్రాణాలైనా సరే ఒడ్డి పోరాడే కార్యకర్తలు, నాయకత్వం ఉంది. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.’’
‘‘ఒకప్పుడు రాజకీయాల్లో పోరాడేవాళ్లం. ఇప్పుడేమో రాష్ట్రంలోని వింత జంతువులతో పోరాడుతున్నాం. మనుషులకు ఓ మనస్సు ఉంటుంది. సైకో.. కింద ఉన్న వారికి అలాంటిదేమీ లేదు. ఒకప్పటి రాజకీయాలకు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వాటికీ పొంతనే లేదు.’’ - చంద్రబాబు