Nara Lokesh : 27 కోట్లతో ఏం సంబంధం?
ABN , First Publish Date - 2023-10-06T04:00:25+05:30 IST
స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిధులను మాజీ సీఎం చంద్రబాబు మళ్లించారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే తెలిపారు.
చట్టబద్ధంగానే ఎన్నికల విరాళాలు
ఈసీకి వివరాలు సమర్పించాం
6 నెలల కిందటే సీఐడీ డౌన్‌లోడ్
మరి ఇప్పటిదాకా ఏం చేస్తోంది?
బాబుపై ఆరోపణలే తప్ప ఆధారాల్లేవు
కస్టడీలో చెప్పింది సీఐడీ రాయలేదు
తమకు కావలసిన జవాబులు చెప్పాలని ఒత్తిడి చేశారు
బాబు తరఫు న్యాయవాది దూబే వెల్లడి
మళ్లీ కస్టడీకి ఇవ్వండి: ఏఏజీ
బాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా
రిమాండ్ 19దాకా పొడిగింపు
విజయవాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిధులను మాజీ సీఎం చంద్రబాబు మళ్లించారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి నాటి ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. గుజరాత్‌లో ఉన్న సీమెన్స్ కేంద్రాలను పరిశీలించిన తర్వాతే సిఫారసు చేసిందని తెలిపారు. గుజరాత్‌లోసీమెన్స్ సంస్థ లేకుండానే కమిటీ నివేదిక ఇచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు కొనసాగాయి. టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.27 కోట్లు జమయ్యాయని చేస్తున్న వాదనలో కొత్త విషయమేమీ లేదని దూబే తెలిపారు. ప్రతి ఏడాదీ పార్టీకి ఉన్న నిధులు, వస్తున్న విరాళాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నారని గుర్తుచేశారు. పార్టీ ఖాతాల్లోకి వచ్చిన నిధుల వ్యవహారం ప్రజాప్రతినిధుల చట్టం కిందకు వస్తుందని.. దానితో సీఐడీకి సంబంధం లేదన్నారు. ఈ నిధులకు సంబంధించిన డాక్యుమెంట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 6న ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేశారన్నారు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు సీఐడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. న్యాయాధికారి హిమబిందు స్పందిస్తూ.. స్కిల్ కార్పొరేషన్ నిధులు ఈ ఖాతాలకు వెళ్లినట్లు తేలితే సీఐడీకి సంబంధం ఉంటుంది కదా అన్నారు. దీనికి దూబే సమాధానం ఇస్తూ.. ఖాతాలకు వెళ్లినట్లు ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సీఐడీ అందజేయలేదన్నారు. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈ నెల 1న ఆడిటర్ జె.వెంకటేశ్‌కు నోటీసు ఇచ్చామన్న ప్రాసిక్యూషన్ వాదన సరికాదన్నారు. సీఐడీ ఆయనకు రెండో తేదీన నోటీసిస్తే.. పదో తేదీన విచారణకు వస్తానని ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు. ఆయనకు కుదిరినప్పుడు విచారణకు వస్తారని.. దీనిని ఆధారంగా చేసుకుని సీఐడీ.. చంద్రబాబును కస్టడీకి ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు నియమించిన అధ్యయన కమిటీలో చంద్రబాబు లేరని, ఆయన ఎలాంటి సిఫారసులూ చేయలేదని చెప్పారు. నోట్ ఫైల్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 40 స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటిలో 2.13 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారని దూబే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, డిజైన్‌టెక్, సీమెన్స్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ప్రమేయం లేని ఎంవోయూను ఆయనకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.
రెండు కేసులు ఎలా?
2018లో అవినీతి నిరోధక శాఖలో సీఐయూ(సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్)కు చెందిన కె.నాగేశ్వరరావు అనే అధికారి స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు ఒక లేఖ రాశారని దూబే కోర్టుకు వివరించారు. కార్పొరేషన్‌కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను అందజేయాలని అందులో కోరారని తెలిపారు. దీనినిబట్టి కేసు 2018లోనే ఉందని తెలుస్తోందని.. ఇదే అంశంపై తిరిగి సీఐడీ ఎలా కేసు పెడుతుందని ప్రశ్నించారు. ఒకే నేరంపై రెండు కేసులు ఉండవని తెలిపారు. ఒకవేళ అలా జరిగితే మొదటిగా నమోదు చేసిన కేసు మాత్రమే నిలుస్తుందని, రెండో కేసు నిలవదని స్పష్టం చేశారు. ‘సీఐడీ పోలీసులు నిజాయితీగా వ్యవహరించడం లేదు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఘంటా సుబ్బారావును నియమించినంత మాత్రాన నేరానికి చంద్రబాబు ఎలా సూత్రధారి అవుతారు? 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగిశాక పోలీసు కస్టడీకి తీసుకోవడం కుదరదు. కోర్టు రెండ్రోజుల కస్టడీకి ఇచ్చినప్పుడు జైలుకు ఉదయం 9.30 గంటలకు వెళ్లాల్సిన అధికారులు 11.30 గంటలకు వెళ్లారు. విచారణలో చంద్రబాబు చెప్పిన జవాబులను వారు రాసుకోలేదు. చివరి రోజున తాము చెప్పినట్లుగా చెప్పాలని ఆయనపై ఒత్తిడి చేశారు. సీఐడీ తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది. దీనిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఫైబర్‌నెట్, ఐఆర్‌ఆర్ కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లు.. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు అడ్డురావని తెలిపారు.
‘స్కిల్’ ఐడియా చంద్రబాబుదే: ఏఏజీ
స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు, దాని నిధుల దారి మళ్లింపు ఆలోచన అంతా చంద్రబాబుదేనని అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ)పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మొత్తం కుంభకోణానికి ఆయన సహకరించారని.. సీఎంకు వీటో అధికారం ఉంటుందని, దాన్ని ఉపయోగించుకుని నోట్ ఫైల్‌ను మార్చేశారని.. కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారనడానికి ఇదే నిదర్శనమన్నారు. నిధులు మళ్లించుకోవడానికి ముందుగానే ప్రణాళిక వేసుకుని, దానికి రక్షణగా మంత్రివర్గ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకున్నారన్నారు. రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు వివరాలేమీ చెప్పలేదని.. ఆయన నుంచి రాబట్టాల్సి ఉందని.. అందుకోసమే కస్టడీకి అడుగుతున్నామన్నారు. యూటీఐ బ్యాంక్ నుంచి టీడీపీకి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లలోకి రూ.27 కోట్లు వెళ్లాయని చెప్పిన ఏఏజీ.. కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు అందజేశారు. అసలు సీమెన్స్ అనే సంస్థే లేదన్నారు.
బాబు జ్యుడీషియల్ రిమాండ్ 19 వరకు పొడిగింపు
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. గురువారంతో రిమాండ్ గడువు ముగిసిపోవడంతో ఆయనకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి.. సాయంత్రం 4.20 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయన్ను వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా.. సీఐడీ అధికారులు రెండ్రోజుల కస్టడీలో చేసిన విచారణకు సంబంధించిన వివరాలను అందజేయాలని చంద్రబాబు ఆమెను కోరారు. సీఐడీ అధికారులు వేసిన ప్రశ్నలు, తాను ఇచ్చిన జవాబులకు సంబంధించిన కాగితాలను అందజేయాలని విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయాధికారి సమ్మతించారు.