ఏమైందో?

ABN , First Publish Date - 2023-06-07T00:00:52+05:30 IST

అటవీ ప్రాంతంలో ఓ నెమలి గాయాలతో కనిపించి... చివరకు మృతి చెందడం కలకలం రేగుతోంది. అసలు ఏమై ఉంటుందోనన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా దాడి చేశారా? లేక వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఇలా జరిగిందా: అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమైందో?
చనిపోయిన నెమలికి దహన సంస్కారాలు చేస్తున్న అటవీశాఖ సిబ్బంది

అటవీశాఖకు అప్పగింత

చికిత్స పొందుతూ మృతి

సీతంపేట: అటవీ ప్రాంతంలో ఓ నెమలి గాయాలతో కనిపించి... చివరకు మృతి చెందడం కలకలం రేగుతోంది. అసలు ఏమై ఉంటుందోనన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా దాడి చేశారా? లేక వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఇలా జరిగిందా: అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాటుసారా తయారవుతుందనే సమాచారం మేరకు సోమవారం సాయంత్రం సీతంపేట ఎస్‌ఐ నీలకంఠారావు ఆధ్వర్యంలో పోలీసులు పులిగుమ్మి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో కదలలేని స్థితిలో ఉన్న ఓ నెమలి వారికి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా దాని కాలికి దెబ్బ తగిలినట్లు గుర్తించారు. వెంటనే సీతంపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పాలకొండ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న కొత్తూరు, తంకిడి ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు హరికృష్ణ, దాలినాయుడుకు పోలీసులు నెమలిని అప్పగించారు. కాగా మంగళవారం ఉదయం ఆ నెమలిని వారు కొత్తూరు వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ పశువుల ఆసుపత్రి శ్రీకాకుళం పరిధిలో ఉందని అక్కడి సిబ్బంది చెప్పడంతో తిరిగి సీతంపేట పశువైద్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఏడీ శ్రీనివాసరావు నెమలికి ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే తీవ్ర గాయాలవడం, ఆహారం, నీరు లేకపోవడంతో మంగళవారం నెమలి మృతి చెందినట్లు అటవీశాఖ సెక్షన్‌ అధికారి హరికృష్ణ తెలిపారు. బగ్గా రిజర్వ్‌ ఫారస్ట్‌లో డీఎఫ్‌వో ప్రసూన ఆధ్వర్యంలో నెమలికి అంత్యక్రియలు పూర్తిచేశామన్నారు. బుధవార పులిగుమ్మి ప్రాంతానికి వెళ్లి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని అటవీశాఖాధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-07T00:00:52+05:30 IST