ఆదుకునేదెప్పుడు?

ABN , First Publish Date - 2023-02-28T00:19:57+05:30 IST

జిల్లాలో కొమరాడ మండలం చోళ్లపదం గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. జిల్లావాసులే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 ఆదుకునేదెప్పుడు?
ముగ్గురు పిల్లలతో శారద భర్త

ఇప్పటివరకూ స్పందించని సర్కారు

మండిపడుతున్న ప్రజా సంఘాలు

సాయం కోసం ఎదురుచూస్తున్న గిరిజనులు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొమరాడ మండలం చోళ్లపదం గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. జిల్లావాసులే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఐదుగురు అంటివలస వాసులు మృతి చెందగా, మరో 8 మందికి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఈ ఘటన జరగ్గా ఆ విషాదం నుంచి బాధితులు తేరుకోలేకపోతున్నారు. కాగా ఇప్పటివరకూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎటువంటి సాయం ప్రకటించలేదు. ఇతర జిల్లాల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించే సందర్భాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని బాధితుల విషయంలో ఇంకా సర్కారు స్పందించకపోవడంపై ప్రజా, గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. వాస్తవంగా ఆ ప్రమాదంలో మృతిచెందిన వారంతా గిరిజనులే. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. కాగా వారి అకాల మరణంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రధానంగా మృతుల్లో మెల్లక శారద భర్త అంధుడు కాగా ముగ్గురు చిన్నపిల్లలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఏ ఆధారం లేక.. ఆదుకునే వారే లేక సర్కారు సాయం కోసం వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని టీడీపీ, సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కుటుంబాలను ఆదుకోవాలి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా గిరిజనులే. వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. కనీసం ఒక్కొక్క కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించాలి. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..

- తోయక జగదీశ్వరి, టీడీపీ కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి

ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడం దారుణం. ఇతర జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరైనా పేదలు మృతి చెందితే ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. మన్యం జిల్లాలో బాధితులకు ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా బాధగా ఉంది. తక్షణమే ఎక్స్‌గ్రేషియో ప్రకటించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.

- కె.సాంబమూర్తి, సీపీఎం నాయకుడు, కొమరాడ

Updated Date - 2023-02-28T00:19:57+05:30 IST