YuvaGalamPadayatra: లోకేశ్ పాదయాత్రకు వెళ్లద్దు.. బతిమాలుకున్న వలంటీర్
ABN , First Publish Date - 2023-02-18T18:45:44+05:30 IST
పీలో జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉండాలనే...
శ్రీకాళహస్తి: ఏపీలో జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉండాలనే ఉద్దేశంలో వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ఆ వ్యవస్థను ఇప్పుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) పాదయాత్రకు అపూర్వమైన అధరణ వస్తోంది. దీంతో ప్రజలను ఆ పాదయాత్రకు దూరం చేయాలని ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి (Srikalahasti) పట్టణంలో జరిగే లోకేశ్ పాదయాత్ర (Lokesh Padayatra)కు వెళ్లవద్దంటూ ఓ వలంటీరు ఇంటింటికీ వెళ్లి ప్రజలను వేడుకున్న తీరు చర్చనీయాంశమైంది. యువగళం (Yuvagalam) పాదయాత్ర శుక్రవారం శ్రీకాళహస్తిలో సాగింది. పాదయాత్రకు ప్రజలు పెద్దఎత్తున వెళతారన్న ఆందోళన అధికార పార్టీలో మొదలైంది. దీంతో 20వ వార్డులోని కైలాసగిరికాలనీలో సాయి అనే వలంటీరు ఇంటింటికీ వెళ్లి పాదయాత్రకు వెళ్లొద్దంటూ వేడుకున్నారు. అయితే.. ‘ఎందుకు వెళ్లకూడదు.. లోకేశ్ పాదయాత్రపై ఎందుకంత భయం?’.. అంటూ కొందరు నిలదీశారు. ‘మీకు అన్ని పథకాలూ ఇంటికి చేరుస్తున్నాం కదా ఎందుకు వెళుతున్నారు?’ అని వలంటీరు వారిని బతిమలాడాడు. వలంటీర్ ప్రాధేయపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ సానుభూతిపరులను, పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో, పట్టణాల్లో గ్రామ/వార్డు వలంటీర్లుగా నియమించుకుంది. గ్రామం, పట్టణంలోని ప్రతి 50 ఇళ్లకో వలంటీర్‌ను నియమించింది. వలంటీర్లు వైసీపీ (YCP) కార్యకర్తలేనంటూ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy), మంత్రి అంబటి రాంబాబు తదితరులు ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. దీనికితోడు సామాజిక పింఛన్ల పంపిణీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జగన్ సర్కారు వారికే అప్పగించింది. ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. అదే సమయంలో ఏటా అవార్డుల పేరుతో కొంత నగదు కూడా ముట్టజెబుతోందంటూ వీరి నియామకంపై ప్రారంభం నుంచే ఆరోపణలున్నాయి.
వలంటీర్ల వ్యవస్థపై విమర్శలు
వచ్చే ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ (CM Jagan) తన మానస పుత్రిక వలంటీరు వ్యవస్థ తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పార్టీ శ్రేణుల కంటే వలంటీరు వ్యవస్థనే ఎక్కువగా నమ్ముతున్నారు. రాష్ట్రస్థాయిలో వ్యూహకర్తల బృందం ఉండగా.. క్షేత్రస్థాయిలో వలంటీర్లు పనిచేస్తేనే గెలుపు సాధ్యమన్న భావనతో ఉన్నారు. అందుకే వలంటీర్లపై గృహసారథులు, సచివాలయ కన్వీనర్లను నియమిస్తున్నారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా వలంటీర్లతో సమావేశమై వచ్చే ఎన్నికల కోసం దిశ నిర్దేశం చేస్తున్నారు. అయితే వలంటీర్లు ప్రభుత్వ సేవకులుగా ఉన్నారు. గృహ సారథులుగా నియమితులైన వారు మాత్రం పార్టీ మనుషులు. వలంటీర్లు వైసీపీ సానుభూతిపరులు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ గృహసారథులను పార్టీ మనుషులను నియమించి.. పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు. 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున నియమించనున్నారు.