Share News

పులకించిన క్షీరారాముడు

ABN , First Publish Date - 2023-11-24T00:11:38+05:30 IST

క్షీరా రామలింగేశ్వరుడు సప్త నదీ జలాలతో పులకించాడు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గురువారం ఉదయం భారీ సంఖ్యలో అయ్యప్పస్వామి మాలధారులు మేళ తాళాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు

పులకించిన క్షీరారాముడు
కలశాలతో సప్తనదీ జలాలను తీసుకువస్తున్న భక్తులు..

సప్త నదీ జలాలతో అభిషేకం

పాలకొల్లు టౌన్‌, నవంబరు 23 : క్షీరా రామలింగేశ్వరుడు సప్త నదీ జలాలతో పులకించాడు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గురువారం ఉదయం భారీ సంఖ్యలో అయ్యప్పస్వామి మాలధారులు మేళ తాళాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, మహిళలు జలాలతో కూడిన 1,116 కలశాలలను ధరించారు. వీరంతా క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని అభిషేకించారు. గురుస్వామి బాబులు మాట్లాడుతూ యడ్లబజారు సెంటర్లో ఉన్న కెల్లక బ్రదర్స్‌ సింధు, గంగా, యమున, సరస్వతి, నర్మద, కావేరి గోదావరి ఇలా సప్తనదుల వద్దకు స్వయంగా వెళ్లి జలాలు తీసుకొచ్చారని దీంతో ఈమహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం అయ్యప్పభక్తులు ఊరేగింపుగా నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లి జలాభిషేకాలు నిర్వహించారు.

వైభోగం.. లక్ష్మీ నరసింహుని కల్యాణం

పెంటపాడు, నవంబరు 23: పెంటపాడు గౌరీదేవి ఆలయం వద్ద గురువారం రాత్రి సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీదేవి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితుల బ్రహ్మత్వంలో స్వామి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత సింహాచలం నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన స్వామి కల్యాణ మూర్తులను గ్రామంలో ఊరే గించారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ నెల 27న శివకల్యాణం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-11-24T00:11:40+05:30 IST