రహదారికి తూట్లు.. భక్తుల పాట్లు

ABN , First Publish Date - 2023-02-28T00:06:57+05:30 IST

అధ్వాన రహదారితో కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

  రహదారికి తూట్లు.. భక్తుల పాట్లు
ఆలపాడు–సర్కారు కాలువ రహదారిపై రాళ్ళు లేచిన దృశ్యం

కైకలూరు, ఫిబ్రవరి 27: అధ్వాన రహదారితో కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాతర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా రహదారి మరమ్మతులు, నిర్మాణం చేపట్టాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోకపోవటంతో భక్తులు, కొల్లేరు గ్రామ ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు. రహదారిపై గోతులను పూడ్చకుండా చదును చేసేందుకు రహదారి మొత్తాన్ని తిరగదీయడంతో రాళ్ళు పైకి లేచి ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. అంతేగాక వాహనాల రాకపోకలు రద్దీగా ఉండడంతో విపరీతమైన దుమ్ము లేచి ప్రయాణించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కైకలూరు మండలం ఆలపాడు నుంచి సర్కారు కాలువ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిలో ఈ దుస్థితి చోటుచేసుకుంది. పెంచికలమర్రు నుంచి సర్కారు కాలువ వరకు రహదారిని అధికారులు తిరగదీసి వదిలివేశారు. నిధులు లేకపోయినా రహదారిని యంత్రాలతో తవ్వి వదిలివేశారు. జాతర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొనైనా ఆర్‌అండ్‌బీ అధికారులు దుమ్ము లేవకుండా వాటర్‌ క్యూరింగ్‌ కూడా చేయకుండా ఉండడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరునాళ్లకు పెద్దింటి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారని అంచనా ఉన్నప్పటికీ అధికారులు రహదారి నిర్మాణ పనులను చేపట్టలేదు. రహదారికి ఇరువైపుల కొల్లేరు సరస్సు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల బాధలు వర్ణనాతీం. ఆదమరిస్తే కొల్లేరులోకి జారి పడే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు తక్షణమే రహదారి నిర్మాణ పనులు చేపట్టి భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం

ఆలపాడు నుంచి సర్కారు కాలువ వరకు రహదారి నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేశామని రహదారి దుస్థితిని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో యుద్ధప్రాతిపాదికన నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారని త్వరలోనే నిధులు మంజూరవుతాయన్నారు.

–సీహెచ్‌ విజయశ్రీఽకర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ, కైకలూరు

Updated Date - 2023-02-28T00:06:57+05:30 IST