వారధి కల నెరవేరేనా..

ABN , First Publish Date - 2023-04-11T00:24:23+05:30 IST

మొగల్తూరు మండలంలోని కొత్తపాలెం, శేరేపాలెం ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గొంతేరు డ్రెయిన్‌పై వారధి నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. కేంద్ర నిధులు రూ.16 కోట్లతో చేపట్టే పనులకు అప్పటి మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించినా గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మార డంతో ఈ వంతెనపై నీలినీడలు అలుముకున్నాయి.

వారధి కల నెరవేరేనా..
పడవపై డ్రెయిన్‌ దాటుతున్న రైతులు

రెండేళ్ల క్రితం మళ్లీ రివర్స్‌ టెండర్లు

అయినా ముందుకు సాగని పనులు

నరసాపురం, మొగల్తూరు, ఏప్రిల్‌ 10: మొగల్తూరు మండలంలోని కొత్తపాలెం, శేరేపాలెం ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గొంతేరు డ్రెయిన్‌పై వారధి నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. కేంద్ర నిధులు రూ.16 కోట్లతో చేపట్టే పనులకు అప్పటి మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించినా గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మార డంతో ఈ వంతెనపై నీలినీడలు అలుముకున్నాయి. 20 శాతం పనులు పూర్తి కాలేదని ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ 2020లో కొత్తగా చేపట్టే పనులకు ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రారం భోత్సవం చేశారు. దీంతో పనులు వేగం అందుకుంటాయని ప్రజలు ఆశించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే మొగల్తూరు, భీమవరం మండలాలకు దగ్గర మార్గం ఏర్పడనుంది. అయితే పనులు నత్తనడకన నడుస్తుంటే వారధి నిర్మాణం పూర్తవుతుందా అన్న సందేహం నెలకొంది.

పొలం వెళ్లాలంటే పడవ ఎక్కాల్పిందే

గొంతేరు డ్రెయిన్‌కు అవతల వైపున శేరేపాలెం, కొత్త పాలెం గ్రామాలకు చెందిన రైతులకు రెండు వేల ఎకరాలు ఉంది. పొలాలకు వెళ్లాలంటే డ్రెయిన్‌ దాటాల్సిందే. వంతెన లేక పోవడంతో ఈ ప్రాంత రైతులంతా సొంతంగా పడవల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లే తెడ్డుతో నడుపు కుంటూ డ్రెయిన్‌ దాటుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువుగా ఉంటే పడవలు బొల్తాపడిన సంఘటనలు లేకపోలేదు. గత నెలలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు రైతులు డ్రెయిన్లో పడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు.

30 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం

వారధి నిర్మాణం మా కల. దీనికోసం 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. వంతెన పూర్తయితే మొగల్తూరు, భీమ వరం మండలాలకు దగ్గరమార్గం ఏర్పడుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి. ఐదేళ్ల క్రితం శంకుస్థాపన జరిగితే సంబరపడ్డాం. అయితే పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. పాలకులు శ్రద్ధ చూపి వారధి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

– చెన్ను అంజనేయులు, కొత్తపాలెం

దినదిన గండమే

మా పొలాలన్నీ గొంతేరు అవతల వైపు ఉన్నాయి. డ్రెయిన్‌ దాటేందుకు సొంతంగా పడవల్ని ఏర్పాటు చేసు కున్నాం. మాకు నడిపే అనుభవం లేదు. ఈ కారణంగా నీటి ప్రవాహం ఎక్కువుగా ఉన్న సమయాల్లో ప్రమాదాలకు గురి అవుతున్నాం. ఇప్పటి వరకు చాలా జరిగాయి. డ్రెయిన్‌ దాటాలంటే దినదిన గండమే.

–కొత్తపల్లి వెంకటాచలం, కొత్తపాలెం

Updated Date - 2023-04-11T00:24:23+05:30 IST