ఫిష్ ఆంధ్ర..ప్రచారార్భాటమేనా?
ABN , First Publish Date - 2023-04-30T00:51:29+05:30 IST
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో అమలు చేయకపోవటంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందని సామగ్రి
లబ్ధిదారుల పెదవి విరుపు
ముదినేపల్లి రూరల్, ఏప్రిల్ 29 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో అమలు చేయకపోవటంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఫిష్ ఆంధ్రగా ప్రకటించారు. దీనిలో భాగంగా గ్రామాల్లో చేపల విక్రయానికి షాపులు ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకు నుంచి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని, గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో లబ్ధిదారులు ముందుకు వచ్చి సొంత నిధులతో షాపులను ఏర్పాటు చేసినప్పటికీ దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సామగ్రి అందకపోవటంతో షాపులు నామ్‌కే వాస్తేగా మిగిలిపోతున్నాయి. అధికారులు చుట్టూ తిరిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తొలుత ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3.5 లక్షలు రుణం మంజూరు చేస్తామని, ప్రస్తుతం రూ. 2 లక్షలకే పరిమితం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. అసలు మెటీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఎంతో ప్రచారం చేసి షాపులకు అధికార పార్టీ రంగులు వేసి ఫిష్ ఆంధ్ర అంటూ ప్రచారం చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముదినేపల్లి మండలానికి 23 మందికి రుణాలు మంజూరవ్వగా, తొమ్మిది మంది లబ్ధిదారులు మాత్రమే ముందుకు వచ్చారు. ఆయా లబ్ధిదారులు షాపు లు ఏర్పాటు చేసినప్పటికీ మెటీరియల్ రాకపోవటంతో షాపులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ఉపయోగం లేదు : జోషి, లబ్ధిదారు, వైవాక
ఆంధ్ర ఫిష్ పేరుతో షాపు ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత మెటీరియల్ సకాలంలో అందజేయలేదు. బ్యాంక్ నుంచి రుణం మంజూరు చేయలేదు. షాపులు ఏర్పాటు చేసి ఉపయోగం ఏమిటి?
అధికారులు ఏమన్నారంటే..
దీనిపై ఫిషరీష్ ఏఈ సతీష్‌కుమార్‌ను వివరణ కోరగా, షాపులకు మెటీరియల్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా పంపిణీ చేస్తారని వివరించారు. ముదినేపల్లి, సింగరాయిపాలెం, వడాలి, వైవాక, వణుదుర్రు, బొమ్మినంపాడు, పెదగొన్నూరు, గురజ గ్రామాల్లో షాపుల ఏర్పాటుకు లబ్ధిదారులు ముందుకు వచ్చారన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవటంతో ఎంపిక ప్రక్రియ జరగలేదన్నారు.