అడవిలో దొంగలు పడ్డారు!
ABN , First Publish Date - 2023-04-17T00:19:50+05:30 IST
పశ్చిమ ఏజెన్సీలో అక్రమార్కులు పుష్ప సినిమాను గుర్తు చేస్తున్నారు. కంటికి కన్పించిన మేర భారీ చెట్లు నరికి గుట్టు చప్పుడు కాకుండా తరలించేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 చెట్లకు పైగానే నేలకూల్చి మాయం చేశారు.
జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ పరిధిలో చెట్లు నరికివేత
విలువైన చెట్లు నేలమట్టం
గుట్టుచప్పుడు కాకుండా తరలింపు
ఒక్కో చెట్టు వయస్సు 30 ఏళ్లకు పైనే..
దాదాపు 1200 చెట్లకు పైగానే మాయం
భారీగా చేతులు మారిన ముడుపులు..?
అటవీశాఖ సిబ్బందిపై ఆరోపణలు
విచారణ చేపట్టిన శాఖ ఉన్నతాధికారులు
జంగారెడ్డిగూడెం టౌన్, ఏప్రిల్ 16 :
పశ్చిమ ఏజెన్సీలో అక్రమార్కులు పుష్ప సినిమాను గుర్తు చేస్తున్నారు. కంటికి కన్పించిన మేర భారీ చెట్లు నరికి గుట్టు చప్పుడు కాకుండా తరలించేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 చెట్లకు పైగానే నేలకూల్చి మాయం చేశారు. కొన్ని నెలల పాటు చెట్లను నరుకుతుంటే క్షేత్రస్థాయి అటవీశాఖ సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ పరిధిలో రేపల్లె, మోదుగ పరిసర అటవీ ప్రాంతంలోని భారీ చెట్లు మాయం అయ్యి వాటి మొదలు మాత్రమే సాక్ష్యాలుగా నిలిచాయి. దాదాపు 1200 చెట్లకు పైగానే నరికి వేతకు గురయ్యాయి. ఒక్కో చెట్టు వయస్సు సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని 50 ఏళ్ల వయస్సు దాటిన చెట్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. 25 అడుగుల పైగా ఎత్తు పెరిగిన భారీ వృక్షాలను నరికి ఎలా తరలించారని ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి ఒక చెట్టును నరికితే అటవీ ఘాట్ రోడ్డుపై ట్రాక్టర్‌పై రవాణా చేయాల్సిందే. అటువంటిది దాదాపు 1200కు పైగా చెట్లు నరికి అటవీ శాఖ సిబ్బందికి తెలియకుండా తరలించడం అసాధ్యమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చెట్లు నరికిన అటవీ ప్రాంతం నుంచి బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపం మీదుగానే తరలించాల్సి ఉంది. అక్కడ నుంచే తెలంగాణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తరలించినట్టు భావిస్తున్నారు.
విలువైన వృక్షసంపద మాయం
నరికి వేతకు గురైన ప్రాంతంలో అరుదైన వృక్షాలు నేలమట్టం అయ్యినట్టు చెబుతున్నారు. నల్లమద్ది, కొండతంగేడు, కొండమామిడి, గరుగుడు, కరక్రాయి, వేగేశ, టేకు, గుంపెన, గుమ్ముడి కర్ర వంటి వృక్షాలు నరికి వేతకు గురయ్యాయి. వీటిలో ఎంతో విలువైన టేకు చెట్లు ఉన్నాయి. వీటితో గృహాల గుమ్మాలు, ఫర్నీచర్, మంచాల తయారీకి ఎంతో డిమాండ్. కొండ తంగేడు గింజలకు మార్కెట్‌లో మంచి ధర ఉంది. దాదాపు జీడిపప్పు ధరతోనే కొండతంగేడు గింజలు ధర ఉంటుంది. కొండమామిడి చెట్లు కలపతో తలుపు లు, కిటికీలు, ఫ్యాక్టరీలకు తరలిస్తారు. కరక్కాయి చెట్లు ఇచ్చే కరక్కాయిలను గిరిజనులు సేకరించి గిరిజన ఉత్పత్తుల జీసీసీకి విక్రయించే వారు. ఈ చెట్లు కూడా నరికివేతకు గురైనట్టు చెబుతున్నారు. అలానే వేగేశ, నల్లమద్ది, గుంపెన ఇలా ఎంతో విలువైన వృక్ష సంపదను నరికి వేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరికివేతకు గురైన వాటిలో సుమారు 25 అడుగుల ఎత్తు, 4 నుంచి 6 అడుగుల కైవార్యం ఉన్న చెట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఉన్న ఒక్కొ చెట్టు కలప రూపంలో మార్కెట్‌లో దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ధర పలుకుతుం దని ఈ లెక్కన 1200కు పైగానే చెట్లు నరికివేసిన అక్రమార్కులు ఎంత వెనుకేసుకున్నారో అంటూ పలువురు లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి కిందకు రావాలంటే ఘాటీ రోడ్డు మాత్రమే ఉంది. మిషనరీలు, భారీ వాహనాల సహాయంతో చెట్లు నరికి తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ చెట్లు మొదలు, కొమ్మలు మాత్రమే సాక్షాలుగా ఉన్నాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు ఒక్కొ చెట్టు మొదలు ఆధారంగా ఏ జాతికి చెందింది, దాని వయస్సు ఎంతుంటుంది, ఏ స్థాయిలో కలప వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నారు.
సిబ్బంది ఏం చేస్తున్నారు..?
చెట్లు నరికివేస్తుంటే అక్కడ బేస్ క్యాంప్ సిబ్బంది, ఫారెస్టు సిబ్బందికి కనీసం ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదు..? రేంజ్ కార్యాలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఏజెన్సీలో ఎంతో విలువైన అటవీ సంపద ఉంది. ఏళ్ల తరబడి ఇక్కడ వృక్ష సంపద అక్రమార్కుల చేతుల్లో పడి తరలిపోతోంది. ఈప్రాంతంపై అటవీశాఖ సిబ్బంది నిఘా ఉంది. ఎక్కడకక్కడ నైట్ వాచర్స్, గార్డ్‌లు, బేస్‌క్యాంపు సిబ్బంది ఉన్నారు. మాయమైన చెట్లు విషయంలో అటవీశాఖాధికారులు ఊహించని స్థాయిలో ముడుపులు అందడంతో వారు తమ ఉద్యోగ బాధ్యతలను విస్మరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పొగాకు రైతులు బ్యారన్ నిమిత్తం ఒక ట్రాక్టర్ పుల్లను తరలించే ప్రయత్నం చేస్తే గార్డులు, వాచ్‌మెన్‌లు అడ్డుకోవడం, బతుకు తెరువు కోసం అడవి నుంచి వెదురు, ఇతర పుల్లలను సైకిల్‌పై తరలించే వారిపై అటవీశాఖ సిబ్బంది విరుచుకుపడి కేసులు నమోదు చేయడం, లేదంటే వారి నుంచి మామూళ్లు వసూలు చేయడం వంటివి జరుగుతుం టాయి. అటువంటిది కొన్ని నెలలుగా ఈ స్థాయిలో అడవి నుంచి విలువైన వృక్షాలను తరలిస్తుంటే అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.