పోలవరానికి జగన్ గుదిబండ
ABN , First Publish Date - 2023-08-24T00:28:26+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ గుదిబండల తయారయ్యాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మల
ఏలూరుటూటౌన్, ఆగస్టు 23 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ గుదిబండల తయారయ్యాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఏలూరు జిల్లా, ఏలూరు నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణాన్ని 72 శాతం పూర్తి చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో కేవలం 4 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం పోలవరం వెళ్లి నిర్మాణపనులు పర్యవేక్షించే వారని, ఆవిధంగా 28సార్లు పోలవరం పనులు పరిశీలించారన్నారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. అప్పటికి జగన్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయ్యిందని అప్పటివరకు డయాఫ్రం వాల్ గురించి పట్టించుకోకుండా ఉన్న ఏజన్సీలను రద్దు చేయడం వల్లే వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. 2020 ఆగస్టుకు ముందు జగన్ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేసినట్టయితే డయాఫ్రంవాల్ దెబ్బతినేది కాదన్నారు. కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయనందు వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐటీఐ నిపుణుల బృందం తేల్చిచెప్పిందన్నారు. ఈ విధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే 2030 సంవత్సరం వరకు పోలవరం పూర్తి కాదేమోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. 194 టీఎంసీల సామర్థ్యం కలిగిన పోలవరం ప్రాజెక్టు నాణ్యతతో నిర్మాణం సాగించకపోతే గోదావరి జిల్లాల ప్రజలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో రో డ్లపరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఎక్కడా ఒక్క పరిశ్రమ వచ్చిన పాపానలే దన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. చివరా కరుకు వైద్య కళాశాలలో సీట్లు అమ్ముకునే స్థాయికి జగన్ దిగజారిపోయా డన్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లకు దెబ్బకొట్టాడన్నారు.
రాష్ట్రం ఆర్థికంగా దివాళా : సీపీఐ నేత రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్ రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాళా తీయించాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. పోలవరం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రాన్ని నిధులు అడిగే పరిస్థితుల్లో కూడా జగన్ లేడని అన్నారు. కేంద్రాన్ని నిలదిస్తే జైలు కెళ్తానేమోనని జగన్ భయపడుతున్నాడన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో జగన్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. జగన్ మూర్ఖత్వం వల్ల రాజధాని అమరావతి నిర్మాణం జరగకపోవడం వల్ల రాష్ర్టానికి రాజధాని లేకుండా చేశారన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రజాసమస్యలపై నిలదీయలేని ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి.. నిర్వాసిత కుటుంబాలన్నింటికి నష్టపరిహారం కూడా చెల్లించాలి.
– రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకుడు
ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం అలసత్వం :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రభుత్వం అలసత్త్వం ప్రదర్శిస్తుంది. నిర్వాసితులను తక్కువ సంఖ్యలో చూడం తగదు. లక్షా 6వేల కుటుంబాల నిర్వాసితులు అయ్యారని కేవలం 20 వేల కుటుంబాలే నిర్వాసితులని చెప్పటం దుర్మార్గం. తక్షణమే నిర్వాసితులందరికి నష్టపరిహారం చెల్లించాలి.
– రాజనాల రామ్మోహనరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
పోలవరం ప్రాజెక్టు కోసం పోరాడాలి
పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయాలకు అతీ తంగా ప్రాజెక్టు కోసం పోరాడాలి. పోలవరం పూర్తయితేనే రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతంది. ప్రధాని మోదీకి పోలవరం పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదు. జగన్ అనాలోచిత విధానాలతో పనులు ప్రశ్నార్థకంగా మారాయి.
– లక్ష్మీనారాయణ, సామాజిక విశ్లేషకులు
మోదీ, జగన్‌లను తరిమి కొడదాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఏలూరు టూటౌన్/జంగారెడ్డిగూడెం, ఆగస్టు 23 : పోల వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ నిర్వీర్యం చేశాడని, రాష్ట్రంలో జగన్, దేశంలో మోదీలను తరమికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర బుధవారం జంగారెడ్డిగూడెం అనంతరం ఏలూరుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్లో ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత జరిగిన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 922 రోజుల నుంచి 33 కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్య మంత్రి జగన్ దుర్మార్గ విధానాలతో అస్తవ్యస్త పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో రూ.9 లక్షల కోట్లు రుణాలు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పేరుతో గిరిజనులను నిండా ముంచారని, లక్షా 6వేల కుటుంబాలు నిర్వాసితులు ఉంటే కేవలం రూ.20వేల కుటుంబాలకు నష్టపరిహారం జగన్ ఇస్తాననడం దుర్మార్గమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడం వల్లే ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుందన్నారు. ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం డిజైన్ మార్చి నిర్మాణాన్ని కుదించడం వల్ల 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు.
ఫ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్య, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, చంద్రనాయక్, ఆర్.పిచ్చయ్య, మహంకాళి సుబ్బారావు, కారం దారయ్య, సీపీఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జేవీ రమణ రాజు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.