ఆ నాలుగు లేకుండానే..

ABN , First Publish Date - 2023-02-18T00:16:24+05:30 IST

స్థానిక సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే ఏమవుతుంది, న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు సామరస్యంగా వడ్డెక్కించాల్సిన ప్రభుత్వం మౌనం దాలిస్తే ఎలా ఉంటుంది.. సరిగ్గా జగన్‌ సర్కార్‌ ఇలాగే వ్యవహరిస్తుంది.

 ఆ నాలుగు లేకుండానే..

ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు మునిసిపాలిటీలు దూరం

న్యాయపరమైన వివాదాలే కారణం

నాలుగేళ్లుగా ఎన్నికలు లేవు

జరిగి ఉంటే 139 మంది కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉండేది

ఆ చాన్స్‌ కోల్పోయిన మునిసిపల్‌ ప్రతినిధులు

ఉమ్మడి జిల్లాలో దాదాపు ఇదే తొలిసారి

స్థానిక సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే ఏమవుతుంది, న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు సామరస్యంగా వడ్డెక్కించాల్సిన ప్రభుత్వం మౌనం దాలిస్తే ఎలా ఉంటుంది.. సరిగ్గా జగన్‌ సర్కార్‌ ఇలాగే వ్యవహరిస్తుంది. ఉమ్మడి పశ్చిమలో నాలుగు మునిసిపాలిటీల లో విలీన గ్రామాల సమస్య నాలుగేళ్ల క్రితం కోర్టు గడపకు ఎక్కింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఎన్నికలే లేవు. స్థానిక పాలనలేదు. ఇప్పుడు అన్నిటికంటే మించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే భాగ్యం ఆ నాలుగు మునిసిపాలిటీల ప్రతినిధులకు దాదాపు తొలిసారిగా దూరమైంది. ఇంకోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్తా రసవత్తరంగా మారబోతున్నాయి. అధికార వైసీపీలో తగ్గేదేలే అంటూ ఓ వర్గం అంతర్గత చర్చల్లో మునిగి తేలుతుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉమ్మడి పశ్చిమలో నాలుగు మునిసిపాలిటీల్లో నాలుగేళ్ళుగా ఎన్నికలే లేవు. శివారు గ్రామాలను ఆయా మునిసిపాలిటీల్లో విలీనం చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఎక్కడికక్కడ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మునిసిపాలిటీల్లో విలీనం చేయొద్దంటూ స్థానికులే అడ్డం తిరిగారు. మరికొందరు నేరుగా కోర్టులను ఆశ్రయించారు. అంతే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నికలే లేకుండా పోయాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఎన్నికలు జరిగేందుకు వీలుగా న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోతుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. కాని న్యాయపరమైన వివాదాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం కూడా ఒకింత చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. స్థానికులను ఒప్పించడం, లేదా మరో వర్గంలోని వారందరినీ ఓ దారిన పెట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం మునిసిపాలిటీల్లో విలీన వ్యవహారం కోర్టులోనే ఇప్పటికీ ఉంది. ఈ దిశగా ముందుకు సాగాల్సిన జగన్‌ సర్కార్‌ మాత్రం కాస్త ఆవైపు చూసినట్టే కనిపించడంలేదనే భావన కొంద రిలో లేకపోలేదు. అన్నిటికంటే మించి నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రధాన రాజకీయ పక్షాలలు నువ్వానేనా అని తలపడినప్పుడు ఈ నాలుగు మునిసిపాలిటీలతో పాటు నరసాపురం కూడా జోడయ్యేది. కాని మిగతా మునిసిపాలిటీల్లో స్థానిక పాలన ఎంచక్కా సాగుతున్నా ఇక్కడ మాత్రం ఆ దిశగా లేకుండా పోయింది. ప్రత్యేకించి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంపై కనీసం దృష్టి పెట్టిన పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి.

ఆ నాలుగింట లేకుండానే..

ఉమ్మడి పశ్చిమలో కీలకమైన నాలుగు మునిసిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు లేకుండానే ఈసారి తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతకుముందెన్నడూ ఈ పరిస్థితి లేనేలేదు. ఇప్పుడు తొలిసారిగా వచ్చిన ఈ ఆటంకంతో స్థానిక నేతలంతా అవాక్కవుతున్నారు. అసంతృప్తి, కసితో రగిలిపోతున్నారు. ముందుగా తమ మునిసిపాలిటీలను కాస్త పట్టించుకుని ఎన్నికలు జరిగేలా న్యాయపరంగా కొంత చొరవ తీసుకుంటే తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఈ ఎన్నికల్లో పాలుపంచుకునే అవకాశం దక్కేదన్న భావన వీరందరిలో ఉంది. ఇప్పటిదాకా రద్దయిన పాలక మండళ్ళలో పాలకొల్లు కౌన్సిల్‌లో 31 మంది కౌన్సిలర్లు, భీమవరం మునిసిపాలిటీలో 39 మంది కౌన్సిలర్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు, అదే తణుకు మునిసిపాలిటీలో మరో 34 మందితో కలిపి మొత్తం 139 మంది కౌన్సిలర్లుగా ఆనాడు ఉండేవారు. నాలుగేళ్ళ క్రితమే ఎన్నికలంటూ జరిగి ఉంటే ఆయా మునిసిపాలిటీల్లో ఇప్పటికీ అదే సంఖ్యలో కౌన్సిలర్లకు అవకాశం ఉండేది. ఈ పరిస్థితిని తలచుకుని అటు వైసీపీగాని, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యులంతా తీవ్రస్థాయిలో మదన పడుతున్నారు.

సమస్యలను పట్టించుకోని సర్కార్‌

న్యాయపరమైన వివాదాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా కొన్నింటి విషయంలో స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించడం, ఆ దిశగా న్యాయస్థానాల్లో పరిష్కారం లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఆనవాయితి. ఎందుకనంటే విలీన గ్రామాల్లో ఒక సమస్య తలెత్తినప్పుడు రాజకీయ పక్షాలు కూడా జోక్యం చేసుకుని ఆ తరువాత కోర్టులకు ఎక్కాయి. ఆ సమస్యలను ఆయా గ్రామాల్లో పరిష్కరించే దిశగా గ్రామస్థులను ఒప్పించి మెప్పించడం, వారిలో ఉన్న అపోహలను తొలగించడం, మరింత చైతన్యపర్చడం ఆనవాయితి. కాని ఈ సమస్య తలెత్తినప్పుడు ఆఖరుకి నాలుగు మునిసిపాలిటీల్లో ఎన్నికలే జరగకుండా పోయిన పరిస్థితిని సర్కారు సీరియస్‌గా తీసుకోకపోయినందునే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ నాలుగు మునిసిపాలిటీలకు చెందిన ఎన్నికైన ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా పోయింది.

వైసీపీలో తర్జనభర్జన..

ఉమ్మడి పశ్చిమలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు ఒకరిని ఇప్పటికే ఖరారు చేయగా, రెండో స్థానం నుంచి ఎవరిని ఖరారు చేయబోతున్నారనే సస్పెన్స్‌ ఇప్పటికీ వీడలేదు. సామాజిక కసరత్తు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి స్వయంగా ఈసారి పోటీలో ఉండబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అంచనా వేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికే రెండు రోజులు గడిచాయి. శనివారం శివరాత్రి పండుగ సెలవు, ఆదివారం కూడా ఉండడంతో వరుసగా రెండు రోజులపాటు సెలవులు వస్తున్నాయి. తిరిగి సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే కుదిరితే శనివారం జాబితా వెలువడగలదని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఇప్పటిదాకా సాగిన ఊహాగానాలు, పార్టీ అంచనాల ప్రకారం ఒక స్థానం నుంచి జయమంగళ వెంకటరమణ, మరో స్థానం నుంచి గుణ్ణం నాగబాబు పేర్లు తెరముందుకు వచ్చాయి. తుది కసరత్తు అనంతరం ఈ రెండు పేర్లే ఉంటాయా లేదా మార్పులు, చేర్పులు చేస్తారా అనేదే ఉత్కంఠగా ఉంది. ఒక లెక్క ప్రకారం వైసీపీలో ఉన్న కొందరు నేరుగా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతారనే సమాచారం ఉండగా దీనిని కూడా వైసీపీ పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-18T00:16:26+05:30 IST