ధైర్యమే ఒక కవచం

ABN , First Publish Date - 2023-07-15T00:46:25+05:30 IST

‘రాష్ట్రంలో మార్పు రావాలి. ఇందు కోసం అందరూ ఒక్కటి కావాలి. ధైర్యం కోల్పోవద్దు. ధైర్యం లేనప్పుడు అమృతం కురిసిన రాత్రి చదవండి. భయమేస్తే శ్రీశ్రీ రచించిన మహా ప్రస్థానం చదవండి. ఎదుర్కొండి. నేర రాజకీయ వ్యవస్థపై తిరగబడండి’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

	ధైర్యమే ఒక కవచం

రాష్ట్రంలో మార్పు రావాలి.. అందరూ ఏకం కావాలి

తణుకు వారాహి యాత్ర విజయోత్సవ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో జే ట్యాక్స్‌, తాడేపల్లిగూడెంలో

కే ట్యాక్స్‌, తణుకులో ఎర్రిపప్ప ట్యాక్స్‌

టీడీఆర్‌ బాండ్‌లు, ఇళ్ల స్థలాల పేరిట వందల కోట్ల అవినీతి.. ఇది ఎర్రి పప్పల ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యేగా విడివాడను గెలిపిద్దాం

తణుకు, జూలై 14 : ‘రాష్ట్రంలో మార్పు రావాలి. ఇందు కోసం అందరూ ఒక్కటి కావాలి. ధైర్యం కోల్పోవద్దు. ధైర్యం లేనప్పుడు అమృతం కురిసిన రాత్రి చదవండి. భయమేస్తే శ్రీశ్రీ రచించిన మహా ప్రస్థానం చదవండి. ఎదుర్కొండి. నేర రాజకీయ వ్యవస్థపై తిరగబడండి’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. తణుకు పట్టణానికే చెందిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అంటే నాకు చాలా ఇష్టం. ‘ఇల్లేమో దూరం. అసలే గాండాంధకారం. చీకటి. చేతిలో దీపం లేదు. ధైర్యమే ఒక కవచం’ ఇదే జనసేన ఆవిర్భావానికి ప్రారంభ వాక్యాలు. తణుకులో వారాహి యాత్ర చేసినప్పుడు నిజంగా నాపై అమృతం కురిసింది. ఆడపడుచులు, యువత, పెద్దలు, పిల్లలు, అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు తమ ప్రేమామృతాన్ని నాపై కురిపించారు. వారందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యావాదాలు చెపుతున్నా. రెండో విడత వారాహి యాత్ర ముగింపు సభను శుక్రవారం తణుకులో నిర్వహించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు సభకు తరలి వచ్చారు. తొలుత చిట్టూరి కన్వెన్షన్‌ నుంచి వారాహి ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు జనసేనానికి నీరాజనాలు పలికారు. దాదాపు గంటకుపైగా యాత్ర కొనసాగింది. మేడలపై నుంచి పట్టణ ప్రజలు పవన్‌ కల్యాణ్‌కు అభివాదం చేశారు. స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. గడచిన ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వ నందుకు క్షమించాలంటూ విడివాడ రామచంద్రరావును సభాముఖంగా కోరారు. గతంలో టికెట్‌ ఇచ్చిన వ్యక్తి పార్టీని వీడిపోయారు. నిబద్ధతతో విడివాడ పార్టీ కోసం నిలబడ్డారు. అతనిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని కోరారు. అనంతరం స్థానిక సమస్యలను ప్రస్తావించారు. అవినీతిపై నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో జే ట్యాక్స్‌, తాడేపల్లిగూడెంలో కే ట్యాక్స్‌, తణుకులో ఎర్పిపప్ప ట్యాక్స్‌’ అంటూ ఎద్దేవా చేశారు. ‘పోలవరం నిర్మించలేకపోతున్నారు. కనీసం రూ.30 కోట్లు వెచ్చించి ఎర్ర కాలువను నిర్మించాలి. అదే జరిగితే వేల ఎక రాలు ముంపు బారిన పడకుండా ఉంటాయి. గోస్తనీ కాలువ కాలుష్యమై పోయింది. దానిని ప్రక్షాళన చేస్తే రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా అవినీతికే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తణుకులో రూ.309 కోట్లు టీడీఆర్‌ కుంభకోణం జరిగింది’ అంటూ పవన్‌ స్థానిక ప్రజా ప్రతినిధిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘గ్రీన్‌ ఫీల్డ్‌ పార్క్‌ కోసమని 9.5 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం నాలుగు రెట్లు విలువైన టీడీఆర్‌ బాండ్‌లు ఇచ్చేశారు. రహదారి విస్తరణ లేకుండానే నాలుగు రెట్ల బాండ్‌లు జారీచేశారు. ముడుపులు అందుకున్న ప్రజా ప్రతినిధి బాగానే ఉన్నారు. ఏమీ కాదనుకుని బాండ్‌లు జారీచేసిన అధికారులు దొరికిపోయారు. అందుకే జనసేన రాజకీయ అవినీతిపై పోరాటం చేస్తోంద’ని పవన్‌ పునరు ద్ఘాటించారు.

ఇంటి స్థలాల సేకరణలోనూ, పూడికలోనూ రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారని విమర్శించారు. ఇళ్లు నిర్మించుకు న్నా.. ఇంటిపై మరో అంతస్తు నిర్మించుకున్నా ఎర్రిపప్ప ట్యాక్స్‌ కట్టాలా అంటూ ఆ నేతను నిలదీశారు. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, అత్తిలి ప్రాంతాల్లో మూడు కాలువలను బాగు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అభివృద్ధి చేయి జగన్‌ అంటూ సూచించారు. తణుకు పట్టణానికి కనీసం డంపింగ్‌ యార్డు కూడా లేకుండా చేశారు. అది కూడా నిర్మించలేని చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. అన్నదాతకు ఓ మంత్రి ఎర్రిపప్ప అని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. పైగా ఎర్రి పప్ప అంటే బుజ్జికన్నా అని సమర్థించుకోవడాన్ని తప్పుపట్టా రు. అలా అయితే ఇది ఎర్రిపప్పల ప్రభుత్వమేనంటూ ఎద్దేవా చేశారు. అంటే బుజ్జికన్న ప్రభుత్వమని చమత్కరించారు. ‘అవినీతి చేయలేను. డబ్బు మనిషిని కాను. మీ భవిష్యత్తు కోసం వచ్చిన మనిషిని పార్టీని నడిపించాలి. బతకాలంటే సినిమాలు చేయాలి. అందుకే అవి నాకు అవసరం’ అని పవన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-15T00:46:25+05:30 IST