Share News

హర..హరమహాదేవ

ABN , First Publish Date - 2023-11-21T00:00:34+05:30 IST

శివోహం..హరోహం.. హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివాలయాల్లో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.

హర..హరమహాదేవ
గునుపూడి సోమేశ్వర ఆలయంలో అభిషేకాలు

కిటకిటలాడిన శైవక్షేత్రాలు

భీమవరం టౌన్‌, నవంబరు 20 : శివోహం..హరోహం.. హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివాలయాల్లో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయంలోని క్యూలైన్‌లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడం వల్ల టికెట్ల ద్వారా 6 లక్షల 45 వేల 436 రూపాయిలు ఆదాయంగా వచ్చిందని ఈవో రామకృష్ణంరాజు తెలిపారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికీ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. కార్తీక అన్నసమారాదన కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అన్న ప్రసాదాన్ని అందించారు. వన్‌టౌన్‌ సీఐ అడబాల శ్రీనివాస్‌ ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పంచారామ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు కలిపి దాదాపు 100కు పైగా వచ్చాయని అధికారులు తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

పాలకొల్లు టౌన్‌ : పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. పార్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీకమాసం పూజలు నిర్వహించి, స్వామి,అమ్మవార్లను దర్శించు కున్నారు. ఆలయ సమీపంలోని రాపాక వారి సత్రంలో దేవస్ధానం ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. దేవస్ధానం చైర్మెన్‌ కోరాడ శ్రీనివాసు, ఈవో యాళ్ల సూర్యనారాయణ ఏర్పాట్లును పర్యవేక్షించారు.

పోలవరం : పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కు వయ్యింది. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి, క్షేత్ర పాలకుడైన భావన్నారాయణ స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రమణ్యేశ్వరస్వామికి, సీతారామచంద్రులకు, అనిస్ర్తీ, పునిస్త్రీ లక్ష్మిగణపతి, భద్రకాళీ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వదిలి కార్తీక దామోదరుడికి పూజలు నిర్వహించారు. రెండు వేల మంది భక్తులు దర్శనానికి వచ్చి పూజలు నిర్వహించారని, సుమారు 1500 మందికి అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వరశర్మ, సిబ్బంది వెంకట్రాజు తెలిపారు.

Updated Date - 2023-11-21T00:00:35+05:30 IST